పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

19

నాతో వివాహమును గుఱించి ముచ్చటించెను. మీపజ్జ లజ్జాభయంబులచే నేమియు మాట్లాడజాలరు. సునీతయను రాజపుత్రిక చారిత్ర మిదివరకు మేమును గొంత వినియున్నవారము. ఆయువతిం బెండ్లి యాడుటకు సందియములేదు. చిత్రఫలకము చూపి వాని సమాధానపరచి యిప్పుడే మీకు వార్తనంపెద. అనుజ్ఞయిండని పలికిన విని మెచ్చుకొనుచు రాజు, సుమిత్రా! అది స్త్రీలుచూచుటకు అంతఃపురమునకు బంపితిమి. నీవు పొమ్ము. ఇప్పుడే తెప్పించి నీ వేనుకయే అంపెదనని చెప్పిన మహాప్రసాదమని పలుకుచు సుమిత్రుండు విద్యామందిరమునకుం జనియెను.

అందు నలుమూలలు పరికించిన జయభద్రుడెందును గనంబడలేదు. అప్పుడు మిక్కిలి తొట్రుపడుచు అయ్యో వీడిప్పుడా వారకాంత యింటికిం బోయియుండును. నేనేమి చేయుదును? నేను దోడరాకుండగనే యొంటిగా జనియెను. యిక నాజోలి వీని కక్కరలేదు. చివరకు వీని నీదుర్వ్యసనము నుండి తప్పించుట శక్యము గాకుండెను. మహర్షులను గూడ ధ్వంసముచేసిన స్మరప్రవృత్తి రుచి చూపినపిదప మానిపింప వశమా? ఏమియు నెరుంగని దీని దుర్వ్యసనమున నేడు ప్రవేశపెట్టితిని ఱేనికిం తెలిసిన బ్రమాదముగదా! నామాటయు వీడిక వినునోలేదోకదా వెలయాండ్ర వలలో జిక్కినవానికి నన్యము తెలియదు మందులచే మతి చెడగొట్టుదురు. ఈ రహస్య మొరులకుం దెలిసినచో నతని మంచివాడుకకు గళంకమగును. గుప్తము సేయుటయే యుచితమని అనేక ప్రకారముల దలపోయుచు నుపాధ్యాయునికి గూడ జెప్పక అప్పుడే యవ్వారకాంత మేడకుంపోయి జయభద్రా! అని పిలిచెను.

అతని కంఠధ్వని గురుతుపట్టి అతండు లోపలికి రమ్మని పిలిచెను. సుమిత్రుడు లోపలికిరానని చెప్పుచు నొక్కమాట చెప్పవలసియున్నది. వినిపొమ్మని మరలజెప్పగా నెట్లకే నచ్చటికి వచ్చెను.

అప్పు డతనిచేయి పట్టుకొని నీవింత స్వతంత్రుడవైతి వేమి? మీతండ్రి నీకును వర్తమానము బంపెను. నీవు గనంబడలేదని కింకరులు వచ్చిచెప్పిరి. దానికి వారు తల్లడిల్లుచుండగా నేను తీసికొనివత్తు నతండు రహస్యముగా గూర్చుండి చదువుచున్నాడని చెప్పివచ్చితిని. యిందు జాగుచేసితివేని వారుకూడ విద్యామందిరమునకు వత్తురు. సునీతియను రాజపుత్రిక చిత్రఫలక మొకటి తెప్పించిరి. దాని నీకు జూపి నీ వనుమతింతువేని నిప్పుడే వివాహమునకు ముహూర్తము నిశ్చయించి శుభలేఖ వ్రాయుదురట. ఆసునీతి రూపము వర్ణింప జతురాశ్యుని వశముకాదు. వేగిరము రమ్మని పలికిన అతండిట్లనియె

చెలికాడా! నాభారమంతయు నీయదియేనని మొదటనే చెప్పితినికదా? నీకు సమ్మతమేని నాకును సమ్మతమే. చిత్రఫలక మతండు చూచెననియు సమ్మతించెననియు మా తండ్రితో జెప్పుము. శుభలేఖ వ్రాయింపుము. నీ వింటికి నడువుము. నీవెనుకనే వచ్చి కలసికొనియెదను. అనిచెప్పుచు అతనిమాట వినిపించుకొనక దీనస్వరముతో బ్రతిమాలుచు అతనింద్రోసి తలుపుమూసి లోనికిం బోయెను.