పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(20)

మందారవల్లి కథ

161

శిష్యు --- ఇంతేనా? మరియేవిధమైన నంతర్భాగములు కలవా?

శిష్యురాలు -- కలవు . హరిణి, బడబా, కరిణి అని మూడుజాతులు ప్రతి జాతికిం గలవని చెప్పబడియున్నది

శిష్యు - ప్రపంచములోనున్న స్త్రీలందరు పై నుదహరించిన నాలుగుజాతులలోను, ఈమూడుజాతుల లోను జేరియుండవలయును గదా?

శిష్యురాలు --- ఏలచేరకుందురు.

శిష్యు - అట్లయిన హరిణ్యాదిజాతులలో నీ వేజాతిలోని దానవో చెప్పుము. నీ అనుభము చూతము.

శిష్యురాలు - (సిగ్గభినయించుచు) అది యెట్లు తెలియనగు?

శిష్యు - శాస్త్రానుభవముగలిగియున్న వారికి దెలియకమానదు.

శిష్యురాలు — తెలిసినను జెప్ప నగునా?

శిష్యు - అన్నియు నెట్లుచెప్పితివో యిదియు నట్లే.

శిష్యురాలు - ఈలాటి విషమప్రశ్నలు స్త్రీల నడుగవచ్చునా ?

శిష్యు - ప్రతివాదినిలుగావచ్చి స్త్రీలు సభలు చేయుచుండ బురుషుల నెట్లడుగుదును.

శిష్యురాలు - విద్యావిషయముల నడుగక రహస్యప్రశంస సేయవచ్చునా ?

శిష్యు -- రతిరహస్యమునెల్ల నెఱింగిన ప్రౌఢనని నీవు బీరములు పల్కుచుండ నిన్ను నా విషయములలో నడుగక బాలరామాయణములో నడుగవలయునా యేమి?

శిష్యురాలు — సరే! మీరుద్గ్రంధములు చూచితిరికదా! తద్విశేషము లేమియో చెప్పుడు.

శిష్యు - ఆఁ ఆలాగున నడుగుము. బ్రహ్మనిర్మితంబైన త్రివర్గసాధనమను గ్రంథంబున జెప్పబడినజాతులు పద్మినీప్రభృతులు ఒక్కొక్కటి లక్షభేదములు గాగలవిగా నున్నయవి. అవి తఱుచు పశుపక్షిమృగాది నామంబులు గలిగి యున్నవి. హరిణ్యాదిజాతిభేదంబులు ముప్పదివేలు. పురుషజాతులు శశ, వృష్ఠాశ్వాదులుసైతము తొంబదివేలభేదములుగా జెప్పబడియున్నవి. ఈ చెప్పినలక్షణములన్నియు నీగ్రంధములో నున్నవిచూడుము. అని పలుకుచు దత్సమయోచితముగా గొన్నిశ్లోకములంజదివి తన ముందరనున్న యొకతాటియాకుల పుస్తకమునుజూపెను అందున్న లిపి అప్పడతి కేమియు దెలియమి నేమియుంజెప్పలేక లజ్జావనతవదనయై యూరకుండెను. అప్పుడు సభ్యులందఱు నావటూత్తముని వాక్పటిమకు మిక్కిలి సంతసించుచు జయజయధ్వనులతో బుష్పముల జల్లిరి.

మందారవల్లి శిష్యకోటి ఆంతయు దెల్ల బోయిన ముఖములతో దెరలోనికి బోయినది. అప్పటికాలము మిగిలినందున నంతటితోసభ ముగించుటకును మరునాడావేళకే సభ మరలజేయుటకును, రాయల వారుత్తరువు చేసిరి. అందఱును యథా