పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

154

కాశీమజిలీకథలు - మూడవభాగము

మోహింపజేసి జయపత్రికలనందుట వీరికలవాటు కాబోలును లేనిచో యీసంగీత మేల? కాక యెద్దియేని రూపకము ప్రదర్శింతురేమో? అట్లయిన మేమును సావకాశముగా జూచి యానందింతుము.

అని సాక్షేపముగా బల్కిన విని సభాసదు లతనిమాటలు సమయోచితముగ నున్న వని సంతసించిరి. అప్పుడు మందారవల్లి శిష్యురాలొకతె ముందరికివచ్చి ఓహో! ఈవటూత్తముని యుపన్యస్త మెంతేని వింతగా నున్నయది దూరదేశాగతులగు సభ్యుల గమనాయాసము వాయ హాయిగా బాడిన మాగానము వీరిచెవుల కెంత కటువైనదో! అప్రవేశితగృహస్థాశ్రమములకు వీరి కిట్లనుట యుచితమే?

శ్లో. మార్జాలో లభితేన మంజులశుకాలాపేన కౌతూహలం ॥

అనినట్లు మధురములగు చిలుకలపలుకులు పిల్లి కింపగునా? ఆటపాటలని చులుకనగా బలికిరి వాటిలోనైనను వాదించి గెలిసినంజాలుగదా. సంగీతశాస్త్రము కళావళిలోనిదికాదు కాబోలును. అనుటయు మఱియొకతె అంతమాత్ర మెఱింగిన నిట్లేల పల్కునేయను అంతలో వేరొకతె (స్త్రీ బ్రహ్మచారి కెఱుంగఁ బడునె రసము) అని చదివినది. అప్పు డతనిం బరిహసింపుచు నామువ్వురు నూరుశ్లోకముల జదివిరి.

ఆవడుగు కన్ను లెఱ్ఱజేయుచు రాజుదిక్కు మొగంబై యీయాటవెలదుల మాటలు సభ్యులును మీరును వింటిరిగదా? అనపేక్షితముల బ్రసంగింపగూడదను నిబంధన మిప్పుడు విమర్శింపవలయు నిబంధనాతిక్రమణదోషము లేదంటిరేని యిప్పుడు మేమెల్లరము వీరిమాటల కుత్తరము లిచ్చువారము. ఈ విషయము తప్పొప్పులు తేలిన పిదపగాని మేమేమియు మాట్లాడువారముకాము. అని యుక్తియుక్తముగా బలికిన విని రాయలవారు న్యాయవాదులుగా నిరూపింపబడిన పండితులదెస చూపుల వ్యాపింపజేసిరి. ఆ పండితులా విషయమై వారిని ప్రశ్నచేసి వారుచెప్పిన సమాధానము లుచితములుగాలేవని యొప్పించి యా మువ్వురు జవ్వనులకు సభ ముగియువరకు మాటాడకుండునటుల శిక్షవిధించిరి.

దానంజేసి మందారవల్లి శిష్యురాండ్రు అది మొదలు యేమి అనిన నేమి అపరాధము గణింతురో అను వెరపుతో మునుపటివలె విజృంభింపక అడకువతో మాట్లాడ దొడంగిరి. తరువాత రామలింగకవి శిష్యులు నూర్వురును వరుసగా నిలువంబడి ఇట్లు చదివిరి.

గీ. పరభుజంగాఢ్య మందారవల్లియైనఁ
    బెనగొనంగ లవిత్ర సాధన సమృద్ధిఁ
    బరిభవించుట యుచితంబు యరయ నన్మ
    దీయ గురుకార్య పటిమకిది యొకపనియె.

అని చదివిన పద్యమును విని మందారవల్లి శిష్యురాండ్రు తదర్థము గ్రహించి అర్థము జనింప దాని అర్దదోషములు శబ్దదోషములపట్టి శతథా ఖండించుటకు నిశ్చయించుకొని అప్పటి కేమియుం బలుకక పూర్వమువలెనే వరుసగా నిలువంబడి నేనఖి