పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కాశీమజిలీకథలు - మూడవభాగము

మిక్కిలి అక్కజమైనదిగదా! సకలప్రపంచము హృద్గతము చేసికొని చూచిన దానికన్న నెక్కుడుగా లోకులకు బూర్వవృత్తముల దెలియజేయు సుకవులకు రాజ్యముతో నేమిపని, పండితుండగుటయే దుర్లభము. అంతకన్న సుకవి మిక్కిలి శ్లాఘనీయుడు. ఆతడు నిరంకుశుం డయ్యెనేని చెప్పనేల? అట్టి సత్కవికి భార్యవైన నీ అదృష్టము మిగుల కొనియాడదగినది. మందారవల్లి వృత్తాంతము నీవును వినియుందువు. స్త్రీలలోగూడ విద్యలలో ప్రౌఢలైన వారుండిరి సుమీ! అయ్యారే? ఆ తొయ్యలిని సరస్వతి అని చెప్పనోపునట దాని శిష్యకోటిచేతనే మన పండితులు పరాజితులైరి భట్టుమూర్తికి జరిగిన పరాభవము చెప్పనలవికాదట. మొదట నీవిజయలాభము తామే కుడువవలయునని నీ వల్లభుని దూరస్థుని జేసిరట. ఆ కృత్యంబునకు ఫలం బనుభవించిరి. ఆ విషయమైన రాయలవారు మిక్కిలి లజ్జించున్నవారు. ఇప్పుడు వచ్చిన అవమానము వారిదేకాదు. మన అందరిదిని. ఇదివరకు జేసిన కాపట్యము మనంబునం దలంపక యీ యాపద దాటింపుమని భవదీయవల్లభుని మిక్కిలి ప్రార్థించుచున్నా నని రాయలవారు విజ్ఞాపన జేయమనిరి.

శ్లో॥ నభవతి నచిరంభవతి చిరంచేత్పలే విసంవాదీ?
      కోపస్సత్పురుషాణాం తుల్య స్నేహేన నీచానాం॥

దుర్జనమైత్రియుంబోలె సత్పురుషునకు కోపము కలుగదు. కలిగినను చిరకాల ముండదు ఉండినను ఫలసమయంబున విసంవాదిగా నుండును.

అని మిక్కిలి చాతుర్యముగా బలికిన విని కవిపత్ని దేవీ! దీనికి మమ్మింతగా గొనియాడవలయునా? మీ అవమానము మాయదికాదా? ఆయన గ్రామాంతర మరిగి నందులకు నేనేమిచేయుదానను? మందారవల్లిం బరిభవించుటకు ఆయన యుండవలయునా? ఆయనకూతురు యీ మాత్రపు బని జక్కబెట్టగలదు. అని యేమేమోచెప్పి నమ్మించి చేయదగిన కృత్యములన్నియుం బోధించి సవినయముగా రాజపత్నినింటి కంపినది.

ఆసాయంకాలమున పురరహస్య విశేషములన్నియు దెలిసికొని వచ్చి సుభద్రుడు రామలింగకవితో నేకాంతముగా నిట్లనియె కవీంద్రా ! నేను పూజారిభార్య వేషము వైచుకొని పూవులను ఫలముల దీసికొని దేవీప్రసాదము మందారవల్లి కీయవలయునని ద్వారపాలురతో జెప్పి లోపలకుబోయి యెదురుబడక పరిచారకలనడుమ తద్విశేషము లరయుదానింవలె మెలగజొచ్చితిని లోపల నన్నెవరు అంతగా విమర్శింపలేదు. అట్టిసమయమున మందారవల్లి శిష్యురాండ్రతో నీరీతి సంభాషింప దొడంగినది.

మందా — ప్రియంవదా! అష్టదిగ్గజములన నెట్టివారో యనుకొంటిని. మీ తోడనే మాటాడలేకపోయిరేమి? వీరిలో రామలింగకవి యున్నవాడా?

ప్రియం - ఏమో మాకు దెలియదు మాతో బ్రసంగించినవాడు భట్టుమూర్తి