పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

149

బెట్టగా నేమియుఁదోచక యా భూపతి ప్రధానమంత్రి మొగము పై దృష్టి నెర జేసెను.

అప్పుడతండులేచి విద్యావతులారా! మా దివాణములో బెక్కండ్రు పండితులు గలరు కొందఱు గ్రామాంతర మరిగిరి. వారు వచ్చువరకు నూరకుండనేల అని ఈ చిన్న సభ జేయించితిమి. ఇంతమాత్రమునకే గెలిచితిమని పొంగకుండు. ఉద్దఁడులైన పండితులు మిగిలియుండిరి. వారినిగూడ యోడించినప్పుడుగదా జయపత్రిక లందుట. ముందటి సభలో మీప్రజ్ఞజూపుడు. ఇప్పటికి మీ నివాసంబునకుబోవచ్చును సభజేయు దివసము వెనుకవ్రాసి యంపెదము ఈ విషయము మీ యుపాధ్యాయినికి దెలుపుఁడని జెప్పెను. ఆ మాటలువిని అమ్మదవతులు పెదవులు విఱుచుచు నిప్పు డింతయ్యె ముందుగా బోవునది యెంతయో చూతుముగదా? అని పరిహసించుచు తత్రగమనంబుల నా తెరలోనికిఁబోయిరి వెంటనే మందారవల్లి యాందోళికమెక్కి పరిచారికలు సేవింప విజయధ్వనులతో విడిదెకుంబోయెను. తరువాత రాయలవారును బండితులును చిన్నబోయిన మొగంబులతో నివాసంబులకు జనిరి. భట్టుమూర్తి యేదారింబోయెనో యెవ్వరికిం గానుపించలేదు. ఇవియే సభావిశేషములని సుభద్రుఁడు రామలింగకవికి జెప్పెను.

ఆ వృత్తాంతమంతయు విని అతండొక్కింత ధ్యానించి సుభద్రా! ఇప్పుడు మన దివాణమునకు మిక్కిలి అపయశము బ్రాప్తించినది మందారవల్లి సామాన్య అనుకొని మన పండితులు మోసపోయిరి. మాలో మేమెవ్వరి నోడించననులెస్సగాక యొరులచే నోటుపడుట అలంతికదా! భట్టుమూర్తి నాయందుగల యీసున నన్ను దూరస్థునింజేసెను. కానిమ్ము దీనిని నేను కపటోపాయంబున బరిభవించెద. మన ప్రధానమంత్రి మిక్కిలి బుద్ధిమంతుడు. నాయునికి యెఱిగియే అట్లు చెప్పనగును. దివాణములో నేమి యాలోచింపుచుండిరో అరసిరమ్ము. పొమ్మని అతనింబుచ్చి అతండారాత్రి యిష్టదేవతం బ్రార్థించుకొని నిద్దురపోయెను.

అతనికి భగవతీకటాక్షంబున ముందుజేయదగిన విధానమంతయు స్వప్నంబున బొడగట్టినది. అమ్మఱునాడు సుభద్రుండు వచ్చి సంసారరహస్యములం జెప్పుచుండగనే రాజకింకరుడు వచ్చి తలుపు దెరవుడని అరిచెను. సుభద్రుడువచ్చి తలుపు దీయగా రాయలవారి భార్య రామలింగకవి భార్యతో ముచ్చటింప వచ్చినదని యా దూత అతనికి జెప్పెను.

అంతకు మున్ను యా విషయం బెఱింగియున్న రామలింగకవి తన భార్యకు భావికృత్యంబు లన్నియు బోధించెను. ఆమాట విని తాను ప్రచ్ఛన్నముగా నుండి రాజపత్నిని సత్కరించుటకు తన భార్యను నియోగించెను. రాజపత్ని కవిపత్నిచే జేయబడిన సత్కారములకు మిక్కిలి అభినందించుచు జెంత గూర్చుండ బెట్టుకొని గృహకృత్యముల విషయమై కొంత విమర్శించి ప్రశంసాపూర్వకముగా నిట్లనియె. సాధ్వీ! పృథ్వీపతుల గీర్తిమూర్తులజేయ హేతుభూతులగు సకవీంద్రుల మహిమ