పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మందారవల్లి కథ

147

బోయి వేఱొక అలంకారములతో మఱల తెర వెలుపలికివచ్చిరి. అట్లు వెలువడి సభ్యులదిక్కు మొగంబై అమ్మగువలు ఆర్యులారా! మేమందరము మందారవల్లి శిష్యురాండ్రము. మాకు సకలవిద్యలలో బాండిత్యము గలిగియున్నది. ఇందు బ్రతివాదులెవ్వరో దెలుపవలయును. మాతో వాదించి మమ్ములను జయించినతరువాత మందారవల్లితో బ్రసంగించవలయును.

అని తమతమ అభిమానవిద్యల బేర్కొనిరి. ఆబ్బోటులమాటల విని మన పండితులలో నొక్కరుండైన నేను సమర్థుఁడ నీవిద్యలో వాదింతునని ముందర నిలువబడినవాడులేడు. నీవు నీవని యొకరినొకరు ప్రేరేపింప దొడంగిరి.

వారు బేర్కొనిన విద్యలపేరులే వీరికి తెలియవని తెల్లమగుచుండెను. అట్లు కొంతసేపు నిశ్శబ్దముగా నున్నంత నానెలంతుకలు భూకాంతు నుద్దేశించి మహారాజా!

శ్లో॥ క్షోరోదదెచ్చ గాంభీర్యం జానాతి మధనాద్దరిః
     లేహనాయ తటం ప్రాప్తంః కధం విద్యాద్బిడాలకః॥

పాలసముద్రముయొక్కలోతు మధించినహరికిఁ దెలియుగాని పాలంగ్రోల వచ్చిన పిల్లి కేమిదెలియును. విద్యామర్మమునెల్ల గూలంకషంబుగా వెఱింగి జగద్విఖ్యాతిగాంచిన మాయుపాధ్యాయముందర యుదరపోషణార్ధమై చదివిన యీ పండితపుత్ రులేమిలెక్క. ఇందులకు మీరెవ్వరి నేర్పరచితిరి. వారి కేవిద్యవచ్చును. మాలో నిచ్చవచ్చిన మచ్చకంటితో బ్రసంగింపుడు లేకున్న లేదని జయపత్రిక నిప్పింపుడు ఊరక కాలహరణము సేయనేల? అని సావలేపముగా బలికిన నాభూపతి లజ్జాభిమానవిస్మయసంభ్రమంబు లొక్కసారి చిత్తంబు తలపెట్ట గొండొకవడి యూరకుండి కనులెర్రజేయుచు పెద్దన్నగారూ, మందారవల్లి శిష్యురాండ్రు చదివిన శ్లోకం వినబడినదా! కవిరాజుగారికి దృష్టి యిక్కడలేదేమో? సూరన్నగారేమి చేయుచున్నారు. తిమ్మన్నగారు పరాకుగాయుండిరాయేమి? ధూర్జటిగారికి చిత్తచాంచల్యము గలిగినది కాబోలు.

అని యీరీతి నందరం బేర్కొని చురచురబల్కిన నభిమానము దెచ్చుకొని వారు చిత్తము చిత్తము మేమందరము నొక విషయమై యాలోచించుటఁబట్టి యింత దనుక నుపేక్షింపవలసివచ్చెను. ఇదిగో భట్టుమూర్తిగారు వారితో బ్రసంగించుటకు నుద్యుక్తులైయున్నవారని ఆతని ముందరికి ద్రోసిరి.

అతండెట్టకేలేచి ముందరకుబోయి నిలువబడినంత సభ్యులందఱు గరతాళముల వాయించిన పిమ్మట ఆతండెద్ది చదువబోయెనుగాని కంఠము డగ్గుత్తిక జెందుటచే స్వరము వచ్చినది కాదు. మేనంతయు జెమ్మటలుగ్రమ్మ వణకజొచ్చినది. అప్పు డాయువతు లతనింజూచి నవ్వుచు అయ్యా! తమ అభిధేయ మేమి? ఏ శాస్త్రములలో బరిశ్రమజేసితిరి. ఇప్పుడు ప్రతివాదులుగా వచ్చితిరా? రాయలవారి యాస్థానపండితులలో ప్రధానులు మీరే అగుదురా? అని అడిగిన అతండు నొకమాటకు వేఱొకమాట జెప్పుచు వారిమాటలకు వినిమయముగా బ్రత్యుత్తర మిచ్చెను.