పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(18)

తెనాలిరామలింగకవి కథ

145

జయించువాఁడుంబోలె రామలింగకవిని గ్రామాంతరమంపితివే! అతండుండిన దీని గర్వ ప్రాయశ్చిత్తము చేయకపోవునా?

భట్టు — అతండుమాత్రము మనకన్న నెక్కుడువాడా? విద్యలలో దానిగోరునకు బోలడు.

రామభద్రుడు - ఇంకను నీవసూయోక్తులను మానవు.

భట్టు - నీకు రామలింగమునందు పక్షముండిన నుండుగాక! నాతో నలంతిగా మాటాడకుము. నీ రామాభ్యుదయ గ్రంథములో నుపకృతి గావించిన అతనియం దీపాటివిశ్వాసము చూపవలసినదే.

రామభ -- అతండు నీకిరీటము తన్నెనని నీవసూయగా మటాడుచున్న వాడవు. కాని నేను యథార్థమే పలికితిని.

భట్టు - గౌరవము మన్నింపరేని యెట్టిపనినై నను జేయవచ్చును. అతండు నన్నొక్కనినే అవమానించలేదు. మిమ్ములనందఱిని మోసపఱచెను. మీరభిమాన శూన్యులు కావున వానిమాటయే పలుకుచుందురు. మొన్నటిసభలో ధూర్జటికవిని వేశ్యాసంగముమాట వెల్లడిచేసి మానభంగము జేయలేదా?

ధూర్జ - నీవామిషచేత నన్నిప్పుడెత్తిపొడుచుచున్నవాడవు నేనెఱుంగుదును. నాకది అవమానముకాదు. కాని నీదగు బాలచంద్రికాపరిచయ కళంకముమాత్రము స్మరించుకొనుము.

పెద్ద - చాలుచాలు మీరలూరక కలహింపక రేపటిసభలో జేయదగిన వాదవిషయముల నాలోచించుడు.

భట్టు - వాదము లిచ్చటనే. సభలో మాటయేరాదు.

ధూర్జ -- అదియుందీరినదికాదా. పాప మభిమాన ముడిగి వనితావేషము వైచుకొనినను లాభము లేకపోయినది.

భట్టు --- ఊరక అట్లంటినిగాని రేపటిసభలో నా ప్రతాపమును జూతురుగాక . సరస్వతినై నను విద్యలలో దిరస్కరింపగలను. మఱియు రామలింగమువలెనే వీరిరువురను గ్రామాంతరంబు బంపిన జక్కగానుండును. వీరు మనలోనివారని యుంచితిని. ఇంకొకసారి అట్లేచేసెదను.

ధూర్జ - ఇంకొకసారిమాటకు నీసారి నీకు జయముకలిగినప్పుడు కదా ?

పెద్ద - ధూర్జటీ! ఇట్టి సమయమున మీరీతిగా మాటాడుట యుచితముగాలేదు . ఊరకొ'ని చెప్పినట్లు చేయుడు.

ధూర్జ - చిత్తము. మీయాజ్ఞ నుల్లంఘింతుమా! మందారవల్లిని జయించు నుపాయము జూడక యూరక రామలింగకవిని నిందించుచున్నాడని యిట్లంటిని . అతండుండిన మనకిన్ని యాలోచనలు కావలయునా?

పెద్ద --- అగు నామాట సత్యమేకాని గతించినదానికి జింతించిన లాభములేదు. రేపటిసభలో మన మేయేవిద్యలలో వాదింపవలయునో యాలోచించి ఘట్టస్థలములు