పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

కాశీమజిలీకథలు - మూడవభాగము

చున్న సమయమున రాజశాసనము దీసికొనివచ్చి రాజకింకరుం డతనికిచ్చెను. ఆ పత్రికఁజూచిన తత్క్షణ మిప్పుడే పోవుచున్నారని ప్రత్యుత్తరమువ్రాసి అంపి ప్రచ్ఛన్నముగా నందేయుండి సుభద్రునివలన నందు జరుగుచున్న విశేషంబులు దెలిసికొనుచుండెను అమ్మఱునా డొకరహస్యప్రవేశమున భట్టుమూర్తి పెద్దన్న లోనగు పండితులందఱు గుమిగూడుకొన యిట్లు సంభాషించుకొవిరి

భట్టుమూర్తి -- (దీనస్వరముతో) పెద్దన్నగారూ మనకుఁ దీర్పరాని అవమానమురానున్నది. ఏమి చేయుదును. మనము మందారవల్లి నేవిద్యలోను జయింపలేము. ఎంతకష్టము.

పెద్దన్న --- అంత అధైర్యముగా జెప్పుచున్నావు. దానింజూచి మాట్లాడితిరా యేమి?

భట్టు - ఏమని చెప్పుదును. చెప్పుకొన సిగ్గగుచున్నది. మీకేమి? మీరందఱు నెమ్మదిగానేయుండిరి నా కేమియు దోచుటలేదు. ఈ భారము రాజుగారును మీరును నామీద వైచితిరికదా? నిన్న సాయంకాలమున నేను కాంతాకృతితో బుష్పలావికాకైతవంబున నొకచేటికను సహాయముగాదీసికొని తదీయారామమునకు బోయితినిని.

ధూర్జ -- ఓహో! కాంతకృతిఅని మాటలలోను శ్లేషల నుపయోగింపవలయునా? మాకు విడిపోవదు. ఆడురూపు గైకొంటినని స్పష్టముగా జెప్పుము.

భట్టు - చూచితిరా! ఈత డిప్పుడే నన్ను బరిహసింపుచున్నాడు. ఈలాటివారియొద్ద రహస్యము లెట్లు చెప్పనగును.

పెద్ద -- ధూర్జటీ! ఇది పరిహాససమయముగాదు. ఈ యవమాన మతనిదే కాదు. మనమందఱిదిని ఎద్దియో వేషమువేసి యాసతియంబరిభవించుటయే పౌరుషము కవిరాజా! వీనితోనేమి తరువాత జెప్పుము.

భట్టు - ఆర్యా ! దానివైభవ మేమని చెప్పుదును. క్రోశద్వయ వైశాల్యము గల యాతోటలో నేనుంగులు, గుఱ్ఱములు, బండ్లు, వృషభములు, ధేనువులు లెక్కింపనలవిగాక యెక్కొక్కటియే మిక్కిలి వెలగలిగి మనోహరాకారములతో నొప్పుచున్న యవి, దినమునకు దానికెంత వ్యయమగునో తెలియరాదు బరిచారికలు కలిగియుండిరి పిమ్మట నేను హృదయంబున విస్మయం బావేశింప అందున్న ద్వారరక్షకులతో నేను మీయేలికసానిం జూడవచ్చితిం బోవచ్చునా అని అడిగితిని.

పెద్ద ---- ఆడువాండ్రు పోవుటకు నాటంకమేనా ?

భట్టు --- విద్యావంతులుగాని యువతులతోగూడ నానాతి మాట్లాడదట.

పెద్ద - మంచి నియమమే తరువాత ?

భట్టు - నామాటనిని వాండ్రు నీవు విదుషివైనచో బోవచ్చునని నుడివిరి. నేనట్టిదాననే అని వారికిజెప్పి క్రమంబున నేడు ద్వారంబుల గడచితిని. ప్రతి ద్వారమునందును రక్షకులు నన్ను విదుషియగుదువా యని అడుగచుండ అగుదునని