పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనాలిరామలింగకవి కథ

141

వ్రాసినది. దానిం బరిభవించుట యెంతపని మన పండితుల నందరనట్లుండనిండు. నేనొక్కరుండ దానిం దేవరకు దాసురాలింజేసి పంపెద సందేహము వలదు. ఒండు వినుండు మన వికటకవిగారికి నాచేయు పూనిక జెడద్రోయుట సహజగుణమైఉన్నది అతండుండిన నుభయపక్షముల నిర్దూమధామంబు జేయును. కావున అమ్మహానుభావుని కెద్దియేని బనిగల్పించి దూరస్థుంజేయుడు. ఇదియే నా ప్రార్థన అట్లయిన హేలగా నాజవరాలిం దాకట్టుబెట్టెద నిది శపథేరిత మని పలికిన విని యించుక అలుక అభినయించుచు ధూర్జటి యిట్లనియె.

కవిరాజా! యెంతవారికిని బలికిన యట్లుచేయుట దుర్ఘటంబు మందారవల్లి నోడించుట కించుక యాలోచించి చెప్పుము ఊరక డంబములు కొట్టకుము. రామలింగకవి యందుగల యీసు మఱియొక రీతి దీర్చుకొనుము. అతని దూరస్థుని జేసితిమేని ముప్పురాగలదు. ఆ చతురుండుగాక చతుర్ముఖుండు విద్యలలో నోడింపలేడు. నీవు దాని వృత్తాంత మెరుంగక యిట్లు బీరము పల్కుచుంటివి. అందరివలె నూరకుండక యెద్దియో పలికినంతనే గౌరవము రానేరదు. ఈ కార్యమంతయు రామలింగకవి పై బెట్టిన ఆతండెట్లో కార్యము నెరవేర్చును. ఇదియే నాకు దోచినపని యనియూర కుండెను.

అప్పుడు భట్టుమూర్తి మిక్కిలి కోపించుచు వేశ్యలయం దభిమానముండిన నుండుగాక యిట్టిసభలో సూచించుట నీతియే! చాలుచాలు! పిరికితనమెల్లవారి నుద్దండులవలె దోపింపజేయును. సర్వదా యవమానింపుచున్నను వీనికి నాతనియందభిమానము వదలినదికాదు. జాత్యభిమాన మెంతధృఢమైనది? అని యాక్షేపించిన భట్టుమూర్తికి దగుసమాధానము చెప్పుటకు నిలువంబడి అతని వచనవిరామ మరయుచున్న ధూర్జటిని వారించుచు నా రాజచంద్రుం డంతకు బూర్వదినంబున రామలింగకవి తనకు గావించిన యవజ్ఞ మనంబెఱియజేయ రామలింగకవిని దూరస్థుని జేసి అప్పటి విజయంబు భట్టుమూర్తికి గట్టిపెట్టదలంచి వారి కిట్లనియె.

కవిపుంగవులారా! మీరిట్లొండొరులు కలహించి కార్యవిఘాతుకములు చేయరాదు భట్టుమూర్తి విద్యల దిట్టకాని వట్టివాడు కాడు. అతనిదైర్యం బెట్టిదో పరీక్షింపవలసినదే! దీనికి మీరుకపటం చేయక అతనికిం దోడ్పడియుండుడు. రామలింగకవిని రాజ్యకార్యమిషచే దూరముగా నంపెదను. అతనికింగలగర్వ మీమూలమున గొంత అడగగలదు. ఈ రహస్యము వెల్లడిపుచ్చవలదుసుండీ? రహస్యముగా దాని విద్యామర్మంబుల నరసిరండు పొండని పలుకుచు నంతటితో సభ చాలించి యానృపశిఖామణి అంతఃపురమునకుం బోయెను.

నా డేమిటికో రామలింగకవి యీసభకు రాలేదు. రామలింగకవికి సుభద్రుండను మిత్రుండుగలడు. ఆతండు రూపయౌవనవిద్యావిశేషబుద్దిచాతుర్యంబుల రామలింగని అంతవాడని చెప్పనోపు! ఆతం డాసభావిషయంబుల విని అతని కెఱిగింపు