పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(17)

తెనాలిరామలింగకవి కథ

137

బూర్తిగాజదువుడు తరువాత నేను భుజియింతు నిట్టి విషయంబువిన నెవ్వరి కుత్సాహముండదని వేడిన అయ్యతిచంద్రు డంతరంగమున నా తెఱంగు తెలిసికొనుట కౌత్సుక్యముగా నుండుటం జేసి మారుమాట పలుకక అప్పుడే అమ్మాణిక్యంబు దన మ్రోల నిడుకొని కన్నులు మూసికొని ధ్యానించుటయు అవ్విశేషంబంతయు అంతఃకరణగోచరంబైనది అప్పుడా పద్యమిట్లు చదివెను.

సీ. దాది హస్తమున దద్దయు ముద్దుగను పెంపఁ
               బడు రాచసుత పెను జడధిబడుట
    పడి మునుంగక యొండు ప్రాపున దఱిజేరి
               యట వారకామిని కమ్మఁబడుట
    గణికయై కులవృత్తి గొనక విద్యల నేర్చి
               దేశదేశంబుల దిరిగి యొకట
    సిరి గోలుపోయి భూసురున కిల్లాలుగ
               మెలఁగి దానములంద గలిసికొనుట
గీ. కొనకుఁ దలిదండ్రులను గూడికొనుట యహహ
    తలఁచి చూడఁగ దైవతంత్రంబుగాదె
    చిత్రమిది చిత్రమిది సువిచిత్రమిదియ
    చిత్రమిది చిత్రమిది కడుచిత్రమిదియ.

అట్లు చదివిన పద్యము విని వాడు మూపు లెగరవైచుచు అయ్యవారూ! ఈ పద్యంబున నామ దలంచినయట్లేయున్నది. ఈ పద్యమెవ్వరు రచియించి యిందు వ్రాసిరి. ఈపద్య మొకస్త్రీని గుఱించి చెప్పినట్లు తోచుచున్నది. నేనీ దివసంబున మంచివేళ లేచితిని చమత్కార విషయము జూడంగలిగె నేతద్వృత్తాంతఁబంతయు నెఱింగించి నన్ను గృతార్థుఁ జేయుండని వేడుకొనుచున్న శిష్యుని మన్నించుచు అయ్యతి సార్వభౌముండును శిష్యుడును భోజనముచేసినపిదప నొకచోట గూర్చుండి అక్కథ యిట్లు చెప్పఁదొడంగెను.

తెనాలిరామలింగకవి కథ

వత్సా! వినుము. ఆంధ్రదేశరాజులలో మిక్కిలి విఖ్యాతింగాంచిన కృష్ణదేవరాయల చరిత్రము సంక్షేపముగా నీకిదివఱకే చెప్పి యుంటినికదా! అమ్మహారాజుగారి యాస్థానకవీశ్వరులు, అల్లసాని పెద్దన్న, ముక్కుతిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుడు, భట్టుమూర్తి, మాదయగాని మల్లన, పింగళిసూరన్న, ధూర్జటి, తెనాలి రామలింగకవి. వీరి కష్టదిగ్గజములని బిరుదులుగలవు. అప్పటి కాలములో బండితులు గాని, కవీశ్వరులుగాని, శాస్త్రజ్ఞులుగాని వీరితో సమాను లెందును లేరని వాడుక యున్నది. వీరిలో యుక్తిప్రయుక్తులయందును సమయస్ఫూర్తియందును, హాస్య