పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాశీమజిలీకథలు - మూడవభాగము

లకు నాకు జాతిస్మృతి పోయినది. తరువాత నెందెందు గ్రుమ్మరితినో యేమేమి యాచరించితినో నాకుదెలియదు. మఱియొకనాడొక అరణ్యములో గ్రుమ్మరుచుండ బొదలరాయిడిగదలి నాసికలోనున్న మూలిక జాఱిపడినది కాబోలు నేనందు యథాపూర్వవేషముతో నిలువంబడి నన్ను నేను చూచుకొన పూర్వవృత్తాంతమంతయు జ్ఞాపకమువచ్చుటయు నలుమూలలు పరికించి యందు నెవ్వరింగానక మనంబున నిట్లు తలంచితిని. ఆహా! దైవము నన్నీ యరణ్యమధ్యంబున బారవైచి శాపాంతము గావించెను. నేను చిలుకగా నుండిన జక్కగానుండును. ఇప్పుడెందు బోవుదాన ఎవ్వరు దిక్కు అయ్యో! క్రూరమృగంబుల గోలాహలములు వినంబడుచున్న వే యని పెక్కుతెరగుల దలంచుచు నెందేనిసోవుటకు దారినరయుచున్న సమయంబున నొకమూలనుండి యొకవీరుడు విల్లంబులు ధరించి గుఱ్ఱంబుమీదనుండి యొకవరాహమును దరుముకొని నేనున్న చోటికి వచ్చెను వానిఁజూచి నేను మనుష్యదర్శనమునకు సంతసించుచు ఆర్యా! రక్షింపుము రక్షింపుము! దీనురాల దిక్కుమాలి యిందుంటినని యుచ్ఛస్వరంబున వేడుకొనగా నతనికి దయవచ్చి గుఱ్ఱమునాపి మెల్లగా నాయొద్దకువచ్చి దుఃఖోపశమనముగా నిట్లనియె. తల్లీ ! నీవెవ్వతెవు? జన మేన్యమైన యీకాంతారమున కెట్లు వచ్చితివి? నీపతియెవ్వడు? తల్లిదండ్రుల పేరేమి? నీవృత్తాంతము జెప్పుమన అడిగిన నేనిట్లంటి. ఆర్యా! నాకాపురము కుంభఘోణము, నా మనోహరుడు కందర్పుడు నాపేరు సుభద్ర. మాతాతపేరు మణివర్మ నేను విశ్వకర్మ కులస్థురాలనైనను క్షత్రియజాతుండైన కందర్పుని గాంధర్వవివాహమున వరించితిని మాతాతకు దెలియకుండ నొకనాడు మాయింటనున్న మరజింక నాయనకిచ్చితిని కొన్నిదినములకు మాతాత విమర్శించి మరజింక లేమింజేసి పరితపించుచు నాయందనుమానము చెందుచు దయావిరహితుడై నన్ను జిలుకజేసి విడిచి పెట్టెను. నేనును గ్రుమ్మఱుచు దైవవశమున నిందిప్పుడు చిలుకరూపము విడిచి పూర్వరూపము గైకొంటిని. దారితెలియక పరితపించుచున్న సమయములో దేవర యిచ్చోటికి వచ్చితిరి ఇదియే నావృత్తాంతము. నామనోహరుండైన కందర్పుఁడు నేను జిలుకరూపము గైకొనునప్పుడు దేశాంతరమందున్నవాడు. ఇప్పుడెందున్న వాడో తెలియదని పలికినవిని యతండు విస్మయాకుల హృదయుండై దిగ్గున గుఱ్ఱము దిగ్గనురికి నాకిట్లనియె.

తల్లీ! నీవు వెరవకుము. నేను కందర్పుని కుమారుండ నాపేరు నాగదత్తుడు మాతల్లి మనోరమ నేనాయన వెదకుచుంటిని మాతల్లివలన నీవృత్తాంత మిదివరకే నేను వినియుంటినని తన వృత్తాంతమంతయుంజెప్పి నన్నప్పుడే యిచ్చటికి దీసికొని వచ్చెను. నాటంగోలె నన్ను మనోరమ సోదరీభావమునను నాగదత్తుడు మాతృభావమునను జూచుచున్నారు. ఇదియే నావృత్తాంతము. చిరసమయ సంతృప్తమగు కేదారంబు ఘనోదయము బోలె భవదాగమనము నిరీక్షించుచున్న వారమని పలికి