పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

126

కాశీమజిలీకథలు - మూడవభాగము

సంవత్సరముల క్రిందట చనిపోయినది. మేమిరువురమే యీ పట్టణంబున బ్రసిద్ధి జెందిన దేవరదాసురాండ్రము. మా విద్యాగౌరవములు దేవరతండ్రిగా రెఱుంగుదురు ఈతోలుజింక జంకనిడుకొని కూర్చుండిన పురుషుండు కొంతకాలము క్రిందట నీమరజింక నెక్కి యాకాశమార్గమున మా విద్యాపతి యున్న మేడమీదికి వచ్చి తాను శ్రీహరినని చెప్పి దానిని మోసము చేసి ప్రతిదినము రాత్రులయందు వచ్చి దానితో గ్రీడించువాడు.

అదియు అతని నిజముగా శ్రీహరియే అనుకొని యితర చింతలేక సంతతము తద్గోష్టినే వర్తించుచుండునది తాను చెడిన కోతి వనమంతయు జెరిపినదను సామెత రీతి నీనాతి అంతటితో నూర కొనక నాతో నొకనాడు తాను శ్రీహరితో వైకుంఠమునకు బోవుదునని చెప్పినది. నేనామాటవిని యథార్థమనుకొని నన్ను గూడ దీసికొని పోవునట్లు శ్రీహరితో జెప్పుమని కోరితిని. అదియేమి చెప్పినదో రేపురాత్రి మనల శ్రీహరి వైకుంఠమునకు దీసికొనిపోవుటకు నిశ్చయించెను. మన ధనంబంతయు బ్రాహ్మణాధీనము గావింపవలయునని చెప్పిన నాదినమున బూచిన పుల్లయేని దాచక సర్వము పంచిపెట్టితిమి నాయిల్లీ కూర్చుండిన పురోహితునికి దానమిచ్చి అతినియమముతో మేడమీదికి బోయితిమి ఇంతలో నితండు వాడుకప్రకారము మీ జింకనెక్కి వచ్చెను. నా కూతురునను జూపుచు దేవునకు విజ్ఞాపన జేసినట్ల యీతని యొద్ద నిలిచి వైకుంఠమునకు దీసికొని పొమ్మని చెప్పినది. మోక్ష మబ్బుననిన నెవ్వరి కిష్టముండదు? ఈతడీ జింకను పూరించి ముందు విద్యావతి నెక్కమనియె. అదియు వెనుక గూర్చుండనా ముందు గూర్చుండనా అని అడిగినది. ఆ మాట వినినతోడనే యేమి జ్ఞాపకము వచ్చెనో కాని హా! మనోరమా? అని అఱచుచు నేలంబడి మూర్ఛిల్లెను. దాని మూలమున నితనిగుట్టు తెలిసినది. ఈతండు మమ్ము మోసము చేసెను. కావున నీ నష్టమంతయు నితనివలన మాకిప్పింపుడని దేవర గోరుచున్నదాన. నిదియే నా విజ్ఞాపనము ఈ పురోహితునికి మొదట మేము వైకుంఠమునకు బోవుదముగదా అని యిల్లు దానమిచ్చితిని. ఇప్పుడా ప్రయాణము చెడిపోయినది. కావున నా యిల్లు నాకిచ్చునట్లనుగ్రహింపుడు. ఆతని పనికి యారత్నావతి యూరకుండెను.

అప్పుడారాజు కందర్పుని జూచి నీవేమి చెప్పెదవని అడిగిన అతండు లేచి దేవా! ఈ రత్నావతి చెప్పిన దానిలో కొంత నిజము గొంత అసత్యము గలిగియున్నది. నేనా మేడమీదకు బోయినప్పుడు విద్యావతి నీ వెవ్వడవని అడిగిన గందర్పజనకుఁడనని చెప్పితిని అది పండితురాలు కావున నా శబ్దమునకు శ్రీహరి యని అర్దము చేసికొనినది కాబోలును. నా అభిప్రాయమదికాదు. కందర్పజనకుండనిన ధర్మవికారములు గలుగజేయువాడనని అర్థము. సాలగ్రామంబున హరిభావన యుండలేదా? నాయందు దానికట్టి అభిప్రాయ మున్నది కాబోలు నేనేమి చేయుదును. మఱియు నొకనాడు తన తల్లికి వైకుంఠము దొరకు విధియెట్లని అడిగిన దనకున్న