పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

123

నాజన్మములో సంపాదించగలనా? తినుటకొకపూటకైన అన్నములేదు. నిజముగా వైకుంఠమునకు బోవుదమనుకొంటిని కాని యిట్టి కపటమని యెవ్వరికి దెలియును. మహామునులకు బ్రత్యక్షముకాని భగవంతుడు దీనికిని నాకును బ్రత్యక్షమగునాయని యించుకయు శంకింపనైతిని, ఇది పుట్టినది మొదలు నాకు వ్యయమేకాని యించుకయు సంపాదనలేదు యెప్పుడో గొప్పగా నార్జించునను నాసతోనుంటిని. ఒక్కసారియే చక్కగా నార్జించినది. నివసించుటకు గొంపయైనలేదు, మఱికొంతసే పిందుండిన నా బ్రాహ్మణుండు వెళ్ళగొట్టును. ఇది అంతయు దెచ్చి పెట్టినది విద్యావతియే యని అనేకప్రకారముల దలంచుకొనుచు నేడువఁ దొడంగినది.

వాండ్రందఱు తెల్లపోయి చూడదొడంగిరి. విద్యావతియు నివ్వెరపడి యూరక చూచుచుండెను. అప్పుడు కందర్పుండా రోదనము వలన నించుక దెలివి వచ్చుటయు అప్పటి వృత్తాంతమంతయు మఱచి మీరెవ్వరు? నామనోరమ యెందు బోయినది? ఈయిల్లెవరిదని అడుగంగా విద్యాపతి ఏమయ్యా? అట్లనియెదవు నీ వెవ్వడవు. మనోరమ యెవ్వతియ. నిజముచెప్పుమని అడిగిన అతఁడు మఱచిపోయి దాని కిట్లనియె నేను గందర్పుడను రాజకుమారుడ మరజింక నెక్కి దేశాటనము జేయుచు దారిలో నొక పట్టణంబున మనోరమయను రాజపుత్రి మేడమీద వ్రాలి యా ప్రోయాలుమిన్న నిల్లువెడలించి యీపట్టణము జేరితిని.

ఆనారీమణి యూరిబయట తోటలోనున్నది ఫలములు కొని తీసికొనిపోవలయు నిందుదొరకునా అని పలవరించునట్లు చెప్పగా విని విద్యావతియు గుండెలు బాదుకొనుచు దల్లిని గౌగలించుకొని అమ్మా! నేటితో మనపని దీరినదే అని విలపింప దొడగినది.

అంతలో లోపలనుండి పురోహితుడు వచ్చి ఆయ్యో! యిదియేమి? అమంగళముగా నిట్లు రోదనము చేయుచున్నారే మేము గృహప్రవేశోత్సవము గావించుకొందము. పుణ్యాహవాచనము చేయవలయు శూద్రులిందుండరాదు. ఈమేడ దిగి యెక్కడికేనిం బొండని పలికెను.

ఆమాటలువిని రత్నావతి మఱియుం జింతించుచు నేను వైకుంఠమునకు బోవుదునుగదా అని నీకీయిల్లిచ్చితిని ఇప్పుడాపయనము చెడిపోయినది. కావున మేమీ యింటిలోనుండి పోవుటకు వీలులేదు. మీరు మీయింటికి బొండు. తనకుమాలిన ధర్మముండునా ఆనిపలికిన విని అలుకతో నా బ్రాహ్మణుం డిట్లనియె.

ఓహో! నీదాతృత్వ మనుకూలముగానున్నది. నిన్నెవ్వరిమ్మని యేడ్చిరి. నీ వలన గృహదానము పట్టినందులకు నన్ను గులములో బ్రాహ్మణులు వెలివేసిరి. దానికి బ్రాయశ్చిత్తమునకుగాను గొంతసొమ్ము రహస్యముగా మా గురువుగారి కిచ్చుకొన్నాను. యిప్పుడు నీవు దానమిచ్చిన వస్తువులన్నియుం దెచ్చితివేని యిదియు విడిచివేయుదును అని తగవుపెట్టెను.