పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యావతి కథ

111

మునుపునాచుట్టును బెక్కండ్రుమిత్రులు పరివేష్టించి తిరుగువారు. ఇప్పుడొక్కరుడు రాడు. మీమొగముజూడ మహాత్ములవలె దోచుచున్నారు. నిష్కారణము దీనికతంబున దరిద్రుండనై చెడిపోయితిని. దీనిమందలించి నాకెద్దియేని యాధారము గలుగ జేయుడని మిక్కి లిదీనుడై వేడుకొనెను.

కందర్పుం డతని వృత్తాంతమంతయు విని వెరగుపడుచు నౌరా! వారకాంత లెంతకైనం దగినవారు పాపమునకు వెఱువరు. కరుణ యించుకయును బూనరు. ద్రోహమతులు. వారినేమిచేసినను పాపములేదు కానిమ్ము రత్నావతిం గపటోపాయంబున బరిభవించి వీనికుపకారము గావించెదనని తలంచి వాని నోదార్చి బుద్ధిహీనుడవై భాగ్యమంతయు బోగొట్టుకొంటివి. గతంబునకు వగచిన బ్రయోజనము లేదు. నీవీప్రాంతమందే వసియించి ఉండుము. నీయాస్తి నీకిప్పించెదనని యోదార్చి యావేశ్యల రహస్యములన్నియు స్పష్టముగా దెలిసికొని అప్పుడ చిత్రకారుని యింటికిం జని తన కురంగంబునకు గరుడవాహనము రంగు వైపించుకొనెను.

అంత బద్మినీకాంతుం డపరసాగరంబు గ్రుంకిన నొక్కింతసేపునకు దిరుమయంబు లొడలెల్ల మెఱయ దిద్ది కపట శంఖ చక్రాది విభూషణముల దాల్చి కందర్పుండు రెండవ కందర్ప జనకుడువోలె నొప్పుచు నాచర్మకురంగంబును బూరించుకొని యెక్కి గగనంబున కెగసి యావారకాంత మేడదాపుగా బెండెములు దిరుగ జొచ్చెను. అప్పుడు విద్యావతి సఖులతోగూడ నామేడపై గూర్చుండి వీణాగానంబున హరిగీర్తింపుచున్నది. ఆసమయమెఱిగి అతండు తులసీదళమాల యొకటి విద్యావతిపై పడునట్లు దిగవిడిచెను .

బెదురుగదర అమ్ముదవతి యామాలికం గైకొని యాకసమువంక జూచినది. అదిచూచుచుండ వెండియు నతండొక ఉత్తరము విడిచెను. గరుడారూఢుండైన విష్ణుండువలె నొప్పుచున్న అతని అంతరిక్షమున జూచి విభ్రాంతినొందుచు నాఉత్తరమును దత్తరముతో విప్పి చదవగా సుందరీ! నేను గందర్పజనకుండ నీ భక్తికి మెచ్చి నీకు దర్శనంబీయ వచ్చితిననియున్న యాపత్రికను ముమ్మారుజదివి భక్తివివశయై అప్పుడే అందున్న వారినెల్ల దూరముగా నంపి తలుపువైచి రమ్మని చేయి వీచుచు దేవా! ఆర్తరక్షక! రమామనోహర! కరుణాంతరంగ! నేటికి నాయందు దయ వచ్చినదా? స్వామీ? భక్తురాలింగని కనికరింప విచ్చేసితిరా? అనిఅనేక దండకములం జదువుచు ఆతనిని వినుతించినది.

అప్పుడతండు మెల్లన నామేడమీదికి దిగెను. అమ్మగువయు గన్నులు మూసికొని సాష్టాంగమెరగినది. ఆసమయమున నా రాజపుత్రుడు చర్మసారంగంబును దిగి నిలువంబెట్టి తాను విద్యావతిని లేవనెత్తుచు గరంబుకరంబున గ్రహించి అందున్న గదిలోనికిం దీసికొనిపోయెను. యేమనిననేమి అపరాధమోయను వెఱపుతో అత్తరుణియు దత్తదను గుణ్యముగా మెలంగ దొడగినది.