పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

కాశీమజిలీకథలు - మూడవభాగము

తత్కలహప్రకారం బాకర్ణింపుచుండెను. ఆవేశ్య యావిటుని మాటలంగోపించి చేటపోటులు మేననాటించుచు దరిద్రచూడామణీ? యెన్నిసార్లు తోలినను సిగ్గులేక శునకమువలె గుమ్మము విడువకున్నవాడవు. విద్యావతి సులభ అనుకొంటివా, "నక్క యెక్కడ దేవలోక మెక్కడ?" నీబోటి కుమతుల మోమయిన అక్కామినీరత్నంబు దిన్నగాజూడదు. అదియాసపడనేల? ఆయాస వదిలికొని నీదారింబొమ్మని పలికి యాతలుపు తటాలునవై చుకొని లోపలకుబోయినది. అప్పురుషుండు పరుషము లాడుచు దుఃఖితుండయినం జూచి కందర్పుడు దయాళుండగు ఆతనిదాపునకు జేరి యోదార్చుచు నీవిట్లుదీనితో బోట్లాడుటకు గారణమేమి? నీవృత్తాంతమెట్టిది? చెప్పుమనిఅడిగిన సప్పురుషు డతనితో నిట్లనియె.

అయ్యా! నాతెరంగేమని వక్కాణింతును రెంటికిజెడితిని. ఈప్రాంతమందు యొకజనపదంబు గలదు. దానికి మేము అధికారులము.

మాతండ్రి నాబాల్యమున బరలోకగతుండగుటయు మాజనని నాయాస్తి అంతయు సురక్షితముజేసి నేను ప్రాజ్ఞుడనైనతోడనే నాయధీనము గావించినది. ఇక మీయొద్ద దాచనేల. నేనొకనాడు కొందరు మిత్రులతోగూడ నీవీటికి జనుదెంచి యందంద సంచరించుచు నొక దేవాలయములో హరి భజనార్థమై అరుదెంచిన విద్యావతి యను యువతీరత్నమును జూచితిని. ఆమోహనాంగి సౌందర్యాతిశయంబు వర్ణింప నాతరముకాదు తదీయ కులశీలాదుల వితర్కింప వారకాంత అనియు రత్నావతి కూతురనియు దెలియవచ్చినది. యిప్పుడు నాతో గలహించినదె రత్నావతి. అప్పుడట్టి వార్తవిని ముప్పిరిగొను సంతసముతో మిత్రులతోగూడనీ రత్నావతి యొద్దకు వచ్చి నేను విద్యావతిని వరించితిననియు నాయెలనాగను నాకు భోగినింజేసితివేని గ్రమంబున నాభాగ్యంబంతయు దదధీనము చేయుదునని యొక మిత్రునిచే దీనికిం జెప్పించితిని.

అప్పుడు రత్నావతి నన్ను సమిత్రకముగా మేడమీదికి దీసికొనిపోయి యెన్నేని సత్కారములు గావించినది. కాని విద్యావతిని మాత్రము చూపించినది కాదు. నాటంగోలె నేను ప్రతిదినమువచ్చు చుంటిని. రేపురేపు అని యాసజూపుచు మాయింటనున్న వస్తువాహనములన్నియు దెప్పించుకొన్నది. తుదకా గ్రామము గూడ దీనికి వ్రాసియిచ్చితిని. అప్పుడును కొరంతపెట్టిన మాతల్లి వస్తువులు రహస్యముగా దొంగిలించి తెచ్చియిచ్చితిని. యింక నేమి సేయుదును. మాయింట నేమియునులేవు ఆలుమందలన్నియు మొదటినే దీనిపాలు సేసితిని. నన్ను జోగిని సేసినది. విద్యావతి మాటయేమని అడిగిన గొన్నిదినములు వ్రతములు నియమములు బేరుసెప్పి గడపినది. మఱికొన్ని దినములు వ్యాధిమిష జెప్పినది. చివరకు గట్టిగా అడిగినంత నీవు దరిద్రచూడామణివి విద్యావతి నీకెక్కడ లభించును. పో. పొమ్మని కారులరచుచు జేలుదీసికొని బాదినది. యిది మీరు చూచినదేకద? ఇప్పుడేమి చేయుదును? దీనిమూలమున బెండ్లికూడ నాడలేదు. ఆప్తులెవ్వరును గనంబడరు.