పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనోరమ కథ

107

గ్రుమ్మరుచున్న రాజభటులలో గొందరా చెరువు గట్టునకువచ్చి అతనిని విమర్శించి కెందమ్మినంటియున్న కింజల్కములవలె గపోలముల దళ్కు తళ్కుమని మెరయు కుందనపు రేకులంజూచి యీతడే యీతడే అతని యొండొరుల సంభాషించుకొనుచు నవసరములో గందర్పుడు గ్రహించి తటాలున నాచెట్టెక్కి అందున్న జింకను పూరించుకొని అంతరిక్షమున కెగసి దూరముగా బోయెను.

రాజకింకరులతని పోకంజూచి వెరగందుచు నేమియుం జేయలేక వచ్చిన దారింబట్టిపోయి మంత్రితో నావృత్తాంతమును జెప్పిరి.

కందర్పుడు నాటిరాత్రి యథాప్రకారము మనోరమ మేడకుబోవుటకు వెరచుచు అర్దరాత్రంబున విమర్శించుచు నరిగి తనరాక నిరీక్షించుచు నిద్రమాని అంతరిక్షమున దృష్టియిడి కూర్చున్న మనోరమకు సంతోషము గలుగజేసి క్రీడావసానమం దయ్యిందువదనతో నిట్లనియె.

ప్రేయసీ! నారాకపోకలు మీవారు గ్రహించిరి. నేటియుదయమున నన్ను బట్టుకొనుటకు గొందరు రాజభటులు వచ్చిరి కాని దైవవశమున దాటించుకొంటిని. రాత్రి గంధముతో బంగారురేకులవైచినది మనము దెలిసికొనలేకపోయితిమి. దాని మూలమున నన్ను వారు గురుతువట్టిరి. మన అంతఃపురమున దిరుగువారలలోనే గుట్టు చెప్పువారున్నారు. సందియమువలదు. ఇక నేనిందుండిన జిక్కకమానను నా కనుజ్ఞయిమ్ము పోయివచ్చెదను. యెప్పటికినన్ను మఱువవద్దు సుమీ! అని పలుకుచున్న విని అక్కలికి కన్నీరు గార్చుచు అతని వక్షముపై వ్రాలి హా, యేమంటిరి? మీరరిగిన నేనొంటరిగా నిందుండుదు ననుకొంటిరా? మీ మాటలు స్నేహపాత్రములు గానేయున్నవి. నేను గర్భవతినగుట మావారు లెస్సగా వినిన తరువాత నేలాగునను బ్రతకనీయరు. వారిచేతిలో జావనేల? మీరే నా ప్రాణములు పోగొట్టి అరుగుడు. యెక్కడికి బోయినను వెనుక చింతయుండదని పలుకుచు వెక్కి వెక్కి యేడువ దొడఁగినది.

అప్పుడప్పడతి కన్నీరు దుడుచుచు నూరడించి కపోలముల రాచుచు అతడు ప్రేయసీ! నీవిట్లు విచారింప నేనేమి చేయుదును. యిందుండినచో మర్యాద నిలువ నేరదు. నిన్ను విడచి పోవుటకును గాళ్ళాడవు. నిన్ను నా వెంట రమ్మనుటకును సందియముగా నున్నది. యిల్లువిడిచి సంవత్సరము కావచ్చినది. వృద్ధులైన తలిదండ్రులు నన్ను గానక యే అవస్థ బొందియుండిరో తెలియదు. ఈదివ్యసాధనంబున మా పట్టణంబున కొక దినములో బోవచ్చును. నీవును నావెంట వత్తువేని నేకొరంతయు నుండదని పలికిన యా రాజపుత్రి యిట్లనియె.

ప్రాణేశ్వరా! నేను నా బంధువుల విడిచి యిదివరకే మీయాధీననైతి. నన్ను రమ్మనుటకు సందియమేల. ఈ యంతఃపురమునకు, రాత్రులయందు జోరుండవలె శ్రమపడి మీరురానేల? మీ దేశమునకు బోయి నిర్భయముగా సుఖింతుము పోనీ, ఈవార్త మా తండ్రికి దెలియజేయుదమన్న గార్యము మిగిలినది, ఇప్పుడు చెప్పిన