పుట:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయభద్రునికథ

13

గీ. మీరు చెప్పినయట్టి శృంగారరస వి
    శేషములనెల్ల శేముషీసీమ నవఘ
    టించి రాపాడఁజేసితి నించుకయును
    నెక్కదయ్యెను నామది కెక్కదింక.

ఆతని అభిప్రాయము గ్రహించి సుమిత్రుఁ డుపాధ్యాయునితో ఆర్యా మీరిప్పు డింటికి దయసేయుడు. మీరు చెప్పవలసినది చెప్పితిరి. నేనును గొంత చెప్పి చూచెదఁగాక అని అప్పుడే అశ్వకశకటము నెక్కించి యాచార్యునంపి సుమిత్రుం డతనికైదండ గొని మెల్లగా నడిపించుచు నావీటి వేశ్యవాటికకు దీసికొనిపోయెను.

ఎండకన్నెఱుగక మిక్కిలి సుకుమారముగలిగి కంతువసంతాదులతో బోల్పదగిన సౌందర్యముతో నొప్పెడి రాజకుమారుండట్లు సుమిత్రునితో గూడి వేడుకలు చూచుచు వీథింబోవుచుండగా నందున్న వారసుందరులందందు నొయ్యారముగా నిలువఁబడి శృంగారవిలోకనంబుల నారాజనందనుం వీక్షింపదొడగిరి.

ఆరాజకుమారుం డంతకుపూర్వ మట్టియువతులఁ జూచి యెరుంగడు. అపూర్వవిస్మయకౌతుకావేశంబున మరల వారిఁజూచుచుండెను గణికామణుల వదనచంద్రికామరీచికలన నొప్పెడు మందహాసప్రసారములు జయభద్రుని నయన కువలయంబుల వికసింపజేసినవి. పూబోడుల వేణీఘనదర్శనంబున రాజకుమారుని హృదయక్షేత్రంబున స్మరాంకురము ప్రాదుర్భవించినది. వాల్గంటుల క్రేగంటి చూపులు నృపనందనునికి శృంగారవిలోకనముల నేర్పినవి. మదనుండా జవరాండ్ర మెరుంగు లెరజూపి యారాచపట్టి హృదయంబు భేదింప జొచ్చెను ఆహా! కాంతాకృతులు నృపసూతికి దృటిలో స్మరవిభ్రమములు గలుగజేసినవి.

అట్లప్పడంతుల నెడతెగక చూచుచున్న యాతనిహస్తంబు గైకొని సుమిత్రుండు మెల్లన నడిపించుచు దత్తద్విశేషంబు లెరింగింపుచుండ నాదండమేడ నుండి యనంగచంద్రిక యనుగణికయొకర్తుక యా రాజకుమారుని రూప మాపోవక చూచిచూచి, తలయూచుచు సోయగమును మెచ్చుకొనుచు సుకుమారమును గొనియాడుచు, యౌవనము నభినందించుచు, వారిందోడితేర నేరుపుగల యొకచేటికిం బుచ్చుటయు నయ్యతివ అతిరయంబునం జని దారికడ్డముగా నిలువంబడి చతురముగా నిట్లనియె.

ఆర్యులారా! మీకు నమస్కారము. అతిసుకుమారగాత్రుడగు నీతం డిట్లు పాదచారియై నడుచుచుండ జూచువారికిగూడ క్లేశకరముగానున్నది. ఈ మనోహరుని మృదుపాదములు భూతలస్పర్శక్లేశంబున నెట్లు కందినవో చూడుడు. ఇంచుకసేపు విశ్రమించి యేగుదురుగాక యొకసారి లోపలికిదయచేయుడని యతివినయముగా బ్రార్థించిన సంతసించుచు నమ్మించుబోడివెంట సుమిత్రుం డతని నాయింటిలోనికిం దీసికొనిపోయెను.