పుట:Kanyashulkamu020647mbp.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధు-- నేను కదలను.

రామ-- అమాంతంగా యెత్తుకెళ్లి వెనకింట్లో కుదేస్తాను.

మధు-- (కుర్చీ వెనకను నిలబడి లుబ్ధావధాన్లు దండలు చేతులతో గట్టిగా పట్టుకుని) మార్కండేయులు శివుణ్ణి చుట్టుకున్నట్లు, బావగార్ని చుట్టుకుంటాను. యెలా లాక్కు వెళాతారో చూస్తాను.

లుబ్ధా-- (తనలో) యేమి మృదువూ చేతులు! తల, తల దగ్గిర చేరిస్తే, యేమి ఘుమఘుమా! (పైకి) "బాలాదపి సుభాషితం" అన్నాడు మావఁగారూ - మధురవాణ్ణి వుణ్ణియ్యండి. మంచి బుద్ధిమంతురాలు. నిజం కనిపెడుతుంది.

రామ-- అయితే మరివిను (చదువును) "మీకొమార్తె ప్రవర్తన బాగావుండక పోవడంచాత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగావున్నది."

లుబ్ధా-- (కొంతతడవు వూరుకుని) నువ్వే నాకొంప తీశావు.

మధు-- పంతులేనా?

లుబ్ధా-- ఒహర్ననవలిసిన పనేవుఁంది?

మధు-- (కొంతతడవు వూరుకొని) నేను మీ యింటికి వెళ్లిపో యొస్తాను. రండి. పెళ్లీగిళ్లీ మానెయ్యండి. మీకు పెళ్లాంకన్న యెక్కువగా సంరక్షణ చేస్తాను.

లుబ్ధా-- (ఆనందం కనపరుస్తూ) బీదవాణ్ణి నేను డబ్బివ్వలేనే? నీలాంటి విలవైన వస్తువను పంతులుగారే భరించాలి.

మధు-- నాకు డబ్బక్కర్లేదు. తిండి పెడతారా?

లుబ్ధా-- ఆహా! అందుకులోపవాఁ!

మధు-- ఐతే పదండి. మరి యీ పంతులుగారిమాయ మాటలు వినక పెళ్లి మానేసి, సుఖంగా యింట్లో కూచుందురుగాని.

రామ-- (మధురవాణివైపు తీక్షణముగా చూసి) నువ్వు భోజనం చెయ్యలేదన్నమాట జ్ఞాపకంవుందా? వెళ్లు.

మధు-- మీచర్య చూస్తేనే కడుపునిండుతుంది. (ఛఱ్ఱుమని యింటిలోనికి పోవును.)

లుబ్ధా-- యీ మధురవాణి. విన్నారా! మావాఁ! వేశ్య అయినా! చాలా తెలిసినమనిషి. మన సంసార్లకి దానికివున్నబుద్ధివుంటే బతికిపోదుం.

రామ-- అవుఁను. బుద్ధిమంతురాలే; గాని వొళ్లెరగని కోపం. యేవైఁనా వెఱ్ఱి అనుమానం పుట్టితే, తనూపై కానదు. చూశారా మావాఁ, మీలాంటి శిష్ఠులు సానివాళ్ల శరీరం తాకకూడదు. అది చిన్నతనంచేత మొఖంమీద మొఖం పెడితే "పిల్లా, యడంగా నిలబడి మాట్లాడు" అని చెప్పాలి. ఒక్కటే వొచ్చింది దీనికి దుర్గుణం. పరాయివాళ్లతో మాట్లాడితేగాని దానికితోచదు. పట్ణవాసంలో వుండడంనించి ఆదురలవాటు అబ్బింది.