పుట:Kanyashulkamu020647mbp.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుబ్ధా- మావెధవ నాపరువుమాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండీ.

రామ- (చదువును)"తాజాకలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచం పెయ్యనాకుడుమాత్రంకద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువ అండ్రు. యిదివట్టి సూప-సూపర్‌-స్టి-షన్‌-అనగా, తెలివితక్కువ నమ్మకం. మనవంటి ప్రాజ్ఞులు లెక్కించవలసినదికాదు. షరా-దీనికి వక చిన్నబైరాగీ చిటికీవున్నది. చిమ్మిటతో పెయ్య నాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌ-పౌడర్‌-అనగా, గుండ కద్దు; ఆగుండ ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే సంప్రాప్తించినచో, పదేపదే క్షౌరం బౌనుగావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ నెంబరు షరా-ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మావదెనగారు జుత్తు పెంచుకునేయడల, మీరేం జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?"

మధు- చాల్చాలు; యీపాటి చాలించండి. గిరీశంగారు యేంతుంటరి?

రామ- యిప్పుడైనా వాడి నైజం నీకు బోధపడ్డదా?(చదువును) "మూడవషరా-యీరోజుల్లో స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగానున్నది. తమకు విశదమే. మీరు స్వర్గంబునకుంబోయి ఇంద్రభోగం బనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసికొన బుద్ధి పొడమ వచ్చును. అదిమాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియునది. ఏలననిన? వద్దని మందళించుటకు ఎదట పడితినో, 'మీయన్న స్వర్గంబున రంభతో పరమానందంబునొందుచు నున్నారుకదా, నా గతేమి' యని యడిగినచో నేమి యుత్తర మీయువాడ?"

మధు- మరి చాలించండి.

రామ- నీ యిష్టం వొచ్చినప్పుడు చదివి, నీ యిష్టం వొచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా? (చదువును) "నాల్గవషరా-కొదువ అన్ని హంశములూ బహు బాగావున్నవి. తప్పకుండా యీ సంబంధం మీరు చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతివంటివారు. మనలో మనమాట, ఆమెకు యీ సంబంధం యెంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తెకట్టేసమయమందు, మీయింటి నూతులోపడి ప్రాణత్యాగం చేసుకుంటానని, యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని ఫర్వాలేదు. ఆ నాలుగు గడియలూ, కాళ్లూ చేతులూ కట్టేదాం. మూడు ముళ్లూ పడ్డతరవాత నూతులోపడితే పడనియ్యండి. మనసొమ్మేం బోయింది? పోలీసువాళ్ల చిక్కులేకుండామాత్రం, వాళ్లకేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసివస్తుంది. యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరిచిపోయినాను, పిల్లజాతకం అత్యుత్కృష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ-"