పుట:Kanyashulkamu020647mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ- (వుత్తరం అందుకుని తనలో) బతికా`న్రా దేవుఁడా. (చూచుకుని) అరే నావుత్తరవేఁకాదే యిది. నానీడచూసి నేనే బెదిరాను (పైకి) మావాఁ! వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే యెంతటి వాడికైనా కొంచం కోపం వొస్తుంది. నెమ్మదిగానూ, మర్యాదగానూ, నన్నొచ్చియేం సహాయం చెయమంటే అది చెయనూ?

లుబ్ధా- మరైతే యీ పటాటోపం వొద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి.

మధు- (లుబ్ధావధాన్లు, జుత్తుముడివిప్పి దులిపి) యేం ధూళి! సంరక్షణ చేసేవాళ్లు లేకపోబట్టిగదా? (గూటిలోనుంచి వాసననూనె దువ్వెనాతెచ్చి తలదువ్వుచుండును.)

రామ- (ఉత్తరం తిప్పి కొనచూసి చదువును.) "శేవకుడు తమ్ములు గిరీశం"- వీడా!

మధు- పైకి చదవండి.

రామ- "నీ గిరీశం", అనగానే పైకి చదవాలేం?

లుబ్ధా- "నీ గిరీశం" అన్నారేం?

రామ- అది వేరేకథ.

లుబ్ధా- పైకి చదవండి.

రామ- (చదువును)"సేవకుడు, తమ అత్యంత ప్రియసోదరులు గిరీశం అనేక నమస్కారములు చేసీ చాయంగల విన్నపములు, త॥ యీ నాటికి వృద్ధాప్యంలోనయినా మీరు తిరిగీ వివాహం చేసుకుని ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్న మాటవిని యమందానందకందళిత హృదయారవిందుడ నైతిని."

లుబ్ధా- వెధవ, వృద్ధాప్యవఁంటా`డూ? మొన్నగాక మొన్ననేగదా యాభైదాటా`యి.

మధు- (దువ్వెన మొలనుపెట్టి, లుబ్ధావధాన్లు జుత్తుముడివేసి) సంరక్షణలేక యిలా వున్నారుగాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనేవారు?

రామ- (చదువును)"మీకు కాబోవు భార్య, నాప్రియశిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటంజేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి యింటనే యుండి పెళ్లిపనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. బహు దొడ్డవారేగాని చంద్రునకు కళంకమున్నటుల వారికి కించిత్తు ద్రవ్యాశా, కించిత్తు ప్రథమకోపముం గలవు."