పుట:Kanyashulkamu020647mbp.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధు- పెళ్లినాలుగురోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి.

రామ- ఆడదానిబుద్ధి సూక్ష్మవఁని చెప్పానుకానూ? మామంచి ఆలోచన చెప్పావు.

మధు- గాని, నాకొకభయం కలుగుతూంది. నిశిరాత్రివేళ పైగొళ్లెం బిగించి, కొంపకి అగ్గిపెడతాడేమో?

రామ- చచ్చావేఁ! వాడు కొంపలు ముట్టించే కొరివి ఔను. మరి యేవిఁగతి?

మధు- గతి చూపిస్తే యేమిటిమెప్పు?

రామ- "నువ్వుసాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి" అంటాను.

మధు- (ముక్కుమీదవేలుంచి) అలాంటిమాట అనకూడదు. తప్పు!

రామ- మంచిసలహా అంటూ చెప్పావంటే, నాలుగు కాసులిస్తాను.

మధు- డబ్బడగలేదే? మెప్పడిగాను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో ఉపకారం?

రామ- మెచ్చి యిస్తానన్నా తప్పేనా?

మధు- తప్పుకాదో? వేశ్యకాగానే దయా దాక్షిణ్యాలు వుండవో?

రామ- తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు.

మధు- పెళ్లివంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి.

రామ- చబాష్‌! యేమి విలవైన సలహా చెప్పా`వు! యేదీ చిన్నముద్దు (ముద్దుపెట్టుకోబోయి, ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దాన్నీకూడా కలియగట్టి తంతాడేమో?

మధు- ఆభయం మీకక్కరలేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశంగారు పుంజాలు తెంపుకు పరిగెత్తుతారు, ఆమె నోరు మహాఁ చెడ్డది.

రామ- అవును. నోరేకాదు, చెయ్యికూడా చెడ్డదే. దాం దెబ్బనీకేం తెలుసును. గాని, మా దొడ్డసలహా చెప్పావు. యేదీ ముద్దు. (ముద్దుపెట్టుకొనును.)

(ముద్దుబెట్టుకుంటుండగా, లుబ్ధావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును.)

లుబ్ధా- యేమిటీ అభావచేష్టలూ!

రామ- (గతుక్కుమని తిరిగిచూసి) మావాఁ పడుచువాళ్లంగదా? అయినా, నా మధురవాణిని నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు?

మధు- నడి కుప్పమీదయెక్కి ముద్దుపెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి. బావగారికి దండాలు, దయచెయ్యండి. (కుర్చీ తెచ్చి వేయును.)

రామ- నాకు మావఁగారైతే, నీకు బావగారెలాగేవిఁటి?

మధు- మాకులానికి అంతా బావలే. తమకు యలా మావఁలైనారో? (లుబ్ధావధాన్లుతో) కూచోరేం? యేమి హేతువోగాని బావగారు కోపంగా కనపడు