పుట:Kanyashulkamu020647mbp.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

కన్యాశుల్కము

చతుర్థాంకము

1-వ స్థలము. రామప్పంతులు యింటిసావిడి.

[రామప్పంతులు కుర్చీమీదకూర్చుని వుండగా మధురవాణి నిలబడి తమలపాకులుచుట్టి యిచ్చుచుండును.]

రామ-- నేనే చిన్నతనంలో యింగిలీషు చదివివుంటే జడ్జీలయదట ఫెళఫెళలాడించుదును. నాకు వాక్‌స్థానమందు బృహస్పతివున్నాడు. అందుచాతనే యింగిలీషురాక పోయినా నాప్రభ యిలా వెలుగుతూంది.

మధు-- మాటలునేర్చిన శునకాన్ని వేటకిపంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.

రామ-- నేనా శునకాన్ని?

మధు-- హాస్యానికన్న మాటల్లా నిజవఁనుకుంటారేవిఁ?

రామ-- హాస్యానికా అన్నావు?

మధు-- మరిమీతో హాస్యవాఁడకపోతే, వూరందరితోటీ హాస్యవాఁడ మన్నారాయేవిఁటి?

రామ-- అందరితో హాస్యవాఁడితే యరగవా?

మధు-- అంచేతనే కుక్కన్నా, పందన్నా, మిమ్ముల్నే అనాలిగాని, మరొకర్ని అనకూడదే? మిమ్మల్ని యేవఁనడానికైనా నాకుహక్కువుంది. యిక మీమాటకారితనం నాతో చెప్పేదేమిటి? మీమాటలకు భ్రమసేకదా మీ మాయలలోపడ్డాను?

రామ-- నాకు యింగిలీషేవొస్తే, దొరసాన్లు నావెనకాతల పరిగెత్తరా?

మధు-- మీ అందానికి మేము తెనుగువాళ్లము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవొఁచ్చింది. గిరీశంగారు మాట్లాడితే దొరలుమాట్లాడినట్టు వుంటుందిట.

రామ-- అటా, యిటా! నీకేంతెలుసును. వాడువొట్టి బొట్లేరుముక్కలు పేల్తాడు. ఆమాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు.

మధు-- అదేమో మీకేతెలియాలి! గాని, గిరీశంగారు లుబ్ధావధాన్లుగారి తమ్ములటా? చెప్పా`రు కారు!