పుట:Kanyashulkamu020647mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాడుకాడు, జడ్జీ గొప్పవాడుకాడు; కాయక్లెశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచాతనే యీ గొప్పదొర్లంతా మెప్పు పొందాలంటే తోటమాలీపని చేస్తారు. చెట్లూ చావఁలూ యెక్కడం వొహటి వాళ్లలో గొప్పవిద్య. లాభంలేనిపని యేదీ దొరచెయ్యడండి మావఁగారూ. దొరగారు వూర్నించి వూరికి వెళుతూండగా దాహవేఁస్తుంది. చెట్లని పళ్లుంటాయి. నడితోవలో చెట్టెక్కడం నేర్చుకోకపోతే దాహంతో చావవలిసిందేగదా? యేజన్సీ కమాన్‌ చేస్తూవుంటే పెద్దపులి వొస్తుందనుకొండి. దొరకి చెట్టెక్కడం చాతయితె చపాల్న చెట్టెక్కి ప్రాణం కాపాడుకుంటాడు. అంచేత చదువుతోపాటు చెట్లెక్కడంకూడా నేరుస్తారు.

అగ్ని-- దొర్ల తరిఫీదంతా అదో చిత్రం. వెంకడు రాసుకుంచున్నాడా, చదువుకుంచున్నాడా అండి?

గిరీ-- యింతసేపూ చదువుచెప్పి "చెట్లూ చావఁలూయెక్కి ఆడుకో" అని తోలేశాను.

అగ్ని-- మీకేం మతి పోయిందా యేవిఁటండి? కాలూచెయ్యీ విరుచుకుంటే?

గిరీ -- రేపు మనవాడికి గుణుపురం తాసిల్దారీఅయి అడివిలో కమాను వెళ్లుతూవుండగా పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్లువొణికి చతికిల బడాలని మీ అభిప్రాయవాఁ యేవిఁటి?

అగ్ని -- మనవాడికి తాసిల్దారీ అవుతుందండి?

గిరీ -- యెందుక్కాకూడదూ? గుఱ్ఱాలెక్కడం, చెట్లెక్కడం మనవాడు నేర్చుకోకపోతే, "నాయనా నువ్వు కమాన్లకి పనికిరావు. డసుకు దగ్గిరకూచుని గుమస్తాపని చేసుకో. తాసిల్దారీ గీసిల్దారీ తలపెట్టకు" అని దొర్లంటారు.

అగ్ని-- అషైతే చిన్నచెట్లెక్కించండిగాని పెద్దచెట్లప్పుడే యక్కనియ్యకండి.

గిరీ -- అంచేతనే జామచెట్టు యక్కమన్నాను. చూశారా?

అగ్ని-- ఓరి! కోతివెధవా!

గిరీ-- అదుగో తిడుతున్నారూ? దొర్లచదువు చదువుకుంటే, దొర్లతరిఫీదు యివ్వక తప్పదు. మీరిలా తిడితే భయపడి కిందపడతాడు; యిలాంటిపనులు మీకిష్టం లేకపోతే, యింగిలీషుచదువు మానిపించి వేదం చెప్పండి.

అగ్ని-- మరిచిపోయి తిట్టాను. యీ యింగిలీషు వాళ్లసంగతంతా అదో వెఱ్ఱిమొఱ్ఱి.

గిరీ-- మీవంటి ప్రాజ్ఞులు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్లనడవడిక మంచిదవడం చాతనే దేవుఁడు యింత రాజ్యైశ్వర్యం వాళ్లకిచ్చాడు. మనశాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినావుఁ. ఆమాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకుపోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మనరాజ్యం లాగుకున్నారు. మీరు యెరిగిన వారుగదా చెప్పండి, గురువులు దగ్గిర శిష్యులు యెంచేశేవారు?