పుట:Kanyashulkamu020647mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గిరీ-- మాటవరసకి అని అంటూంటే, మతిపోయినట్లు మాట్లాడతావేవిఁటి?

బుచ్చ-- అంతేకద?

గిరీ-- అంతేగదంటే, అంతకంటె అదృష్టం నాకు పట్టడం యలాగ? ఆమాట మీరు అన్నా, నేను అన్నా, మీవాళ్లు నన్ను తన్ని తగిలేస్తారు. వెంకటేశంగానీ అన్నట్టాయనా, పెయ్యకట్టుతాడు వుణ్ణేవుంది.

వెంక-- ఓయి నాయనో! (వీపుతడువుఁకొనును) గుప్‌ చప్‌! నే ఆవూసెత్తను!

బుచ్చ-- మానాస్తం, రాంభొట్లుగారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లాడతానంది.

గిరీ-- పెళ్లాడడవేఁ వొస్తే, అచ్చమ్మనీ పిచ్చమ్మనీనా పెళ్లాడతాను? యప్పటికైనా "ఒకళ్లతో నాకు పనేవిఁటి? నా బతుకు సుఖవేఁదో నేను చూసుకుంటాను." అని మీలాంటి దివ్యసుందరవిగ్రహమూ, గుణవంతురాలూ, నామీద కనికరించి "గిరీశంగారూ నన్ను పెళ్లాడండి" అంటే పెళ్లాడతానుగాని అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకున్నారా యేవిఁటి?

వెంక -- మంచిపండు పడిపోయింది అందుకోండి.

గిరీ -- (పండుతీసి) ఆహా యేమిచాయ! వొదినా మీవొంటిచాయని వుంది యీపండు. యిందండి.

బుచ్చ -- బిందెలోపడెయ్యండి. తమ్ముడూ దిగొచ్చి బిందయెత్తు.

గిరీ -- వాడక్ఖర్లేదు. నేనెత్తుతాన్లెండి. (యెత్తి) ఆహా! యేమివయ్యారం!

(బుచ్చమ్మ నిష్క్రమించును.)

శిష్యా! రెండుపళ్లురాల్చు.

వెంక-- నాన్నొస్తున్నాడండోయి దిడ్డీతోవ్వేపు. యేవిఁటి సాధనం?

గిరీ -- ఆకులు దట్టంగా వున్నవేపు దాగో. నేను యాతాంతోడ్డం ఆరంభిస్తాను.


(అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించి.)


అగ్ని-- గిరీశంగారూ, నీరు తోడుతున్నారండీ? అసిరిగాడు తోడుతాడే, యింగిలీషు చదువుకున్నవాళ్లు, మీ కెందుకాశ్రమ?

గిరీ-- పనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు వూసుపోదు. మొక్కలకా, మంచిది నాకా, కసరత్తూ. గవునరు, తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవఁరాణీవారు బీదలూ సాదలకీ యివ్వడానికి బట్టలు కుడతారు. యింగిలీషువాడు సోమరితనం వొప్పడండి. వాళ్లలో పెద్ద కవీశ్వరుడు షేక్‌స్పియరు యేవన్నాడో విన్నారా, "డిగ్నిటీ ఆఫ్ లేబర్‌" అన్నాడు - అనగా కలక్టరు గొప్ప