పుట:Kanyashulkamu020647mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్న యెక్కువవిలవైన రత్నంలాంటి ఆడమనిషి దొరికితే, తప్పకుండా పెళ్లాడవలిసిందే. యీవూరొచ్చేవరకూ నాకలాంటి దివ్యసుందర విగ్రహం, కనపళ్లేదు. మొహవెఁదట చెప్పకూడదు. అలాంటి మనిషి యీవూళ్లో కనపడ్డది; అందరాని పండుకు ఆశించడవెఁందుకని మనసు మళ్లించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నానుగాని మనస్సు లొంగకుండావుంది. భగవంతుడేం జేస్తాడో! మనస్సుతో యావఁంటున్నానంటే, "ఓ వెఱ్ఱిమనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేఁగాని యిన్నాళ్లూ పెళ్లి మానేసి యిప్పుడు 'పెళ్లాడదాం, పెళ్లాడదాం' అని యెందుకు సందడిపడతావు? 'సంసార సాగరం దుఃఖం, తస్మాజ్జాగ్రత జాగ్రత' అన్నాడు. సంసారంలో పడిపోతే మళ్లీ నీకు లోకోపకారం చెయడానికి అవకాశం వుంటుందా?" అని మనస్సుకి బోధపరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం యంతమాత్రం వుండదు చూశారా వదినా! మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను గనక "సత్రాభోజనం, మఠానిద్రా" సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్లాడింతరవాత, అలా సరిపోదే! మనంగాని మావఁగారి మూర్ఖానికి లక్ష్యపెట్టక, యవరితోనూ చప్పకుండా రామవరం వెళ్లిపోయి అక్కడ శాస్త్రోక్తంగా పెళ్లాడావఁంటే, ప్రస్తుతంమట్టుకు విడో మారియేజి సభవారు మనకి నెలకి నూర్రూపాయలు యిస్తారు. ఓ నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపంచేసి, హైదరాబాదులోగాని, బరోడాలోగాని ఓ వెయిరూపాయల వుద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హయిదరాబాదు నవాబు నెలరోజులకిందట పెద్ద ఉద్యోగ విఁస్తానన్నాడు. "నేను ఒకడిదగ్గిర నౌఖరీచేస్తానా?" అని విఱ్ఱవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహాయిస్తారని అప్పుడే యెరిగివుంటే ఆ ఉద్యోగం మించిపోనియ్యకపోదును.

బుచ్చ-- మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు?

గిరీ -- అవును బ్రహ్మచారిగావుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్లిచేసుకోనని శపధం పట్టాను. గాని యిప్పుడు నా అదృష్టంవల్ల లోకం అంతటికన్నా విలవైన వజ్రంలాంటి భార్యా దొరికితే పెళ్లాడక తీరుతుందా? లోకంయొక్క విలవ వెండి అనుకోండి. లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్ఛాయగల కుందనపుబొమ్మ, పజ్యండోవన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలవ యెక్కువా, వెండి విలవ యెక్కువా? చప్పండి.

బుచ్చ-- బంగారవేఁ యెక్కువ.

గిరీ-- సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్లాడక తీరదుగదా. మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకొండి. పెళ్లాడిం