పుట:Kanyashulkamu020647mbp.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుచ్చ -- వాళ్లని చంపేస్తారా యేవిఁటి?

గిరీ-- చంపక్కర్లేదు. "పొమ్మనక్కర్లేదు, పొగబెడితే" చాలునన్నట్టు సానివాళ్లని పెళ్లిళ్లకి పిలవకపోవడం, వాళ్లిళ్లకి వెళ్లకపోవడం, వాళ్లని వుంచుకోకపోవడం పైంచెప్పిన పనులుచేసేవాళ్లని కనపడ్డచోటల్లా తిట్టడం, యిలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలోకైనా మరి సాంది వుండదు. లేకుంటే చూడండి. మన వెంకటేశం పెళ్లికి తప్పకుండా సానిమాళం తెస్తారు. నే యెరుగుదును. కూడదన్నపనల్లా మావఁగారు చాస్తారు, కూడినపని మానేస్తారు. సానిమాళం తావడమనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్నమాట కాదా? పెళ్లినాటికి నా ప్రియశిష్యుడికి కొంచం యీడొస్తుందిగదా. ఆ సానిముండలు యఱ్ఱగా బుఱ్ఱగా వుండడంచూసి, పెళ్లాంమీద అసహ్యంపుట్టి "యీ పసిపిల్ల యదగడవెఁప్పుడు, కాపరానికి రావడవెఁప్పుడు, యీ సానివాళ్లు మా మజాగావున్నారని" వాళ్లని వెంకటేశం వుంచుకుంటే కొంప ములిగిపోతుందిగాని తరవాయి వుండిపోతుందా? యేవఁంటారు?

బుచ్చ -- అవును, నిజవేఁ.

గిరీ-- గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలికి పెళ్లిచెయ్యడానికి, సానివాళ్లని సాగనంపడానికి వీరకంకణం కట్టాను. మరే వచ్చి, మీ తమ్ముళ్లాంటివాళ్లకి అనేకులికి విద్యాబుద్ధులు చెప్పుతున్నాను. గజీతగాణ్ణి ఔటచేత నూతుల్లో గోతుల్లో పడ్డవాళ్లని పైకి తీస్తాను. యింకా నాషనల్‌ కాంగ్రెస్‌ ఒహటుందిగాని అందులో నే చేసేపని చాంతాడంత వ్యాఖ్యానం చేస్తేగాని మీకు బోధపడదు. పరిపరివిధాల లోకోపకారం చేస్తున్నాను.

బుచ్చ -- యీ పనులన్నీ పెళ్లిచేసుకుంటేమాత్రం చెయ్యకూడదా?

గిరీ-- యలా జెయడం? లోకవఁంటే యేవిఁటి గంజిగుంట అనుకున్నారా? యేషియా, యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, ఆష్ట్రలేషియా అని, ఐదు ఖండాలు. అందులో అమెరికాలో మనుష్యులు బుఱ్ఱకిందికీ కాళ్లు పైకీపెట్టి నడుస్తారు. యిక్కడ పగలుగదా యిప్పుడు? అక్కడ రాత్రి. నార్త్‌పోల్‌ అని మరోదేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పొగలే; అప్పుడు మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పొగలుండదు. అక్కడేవిఁటనుకున్నారు. సముద్రం అంతా మంచుకెరడైపోతే లేళ్లని బళ్లకికట్టి సవారీఐ, వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలకీవెళ్లి అక్కడివాళ్లకల్లా ఉపకారం చేస్తేగదా లోకోపకారం అవుతుంది? పెళ్లాంబిడ్డలూ వుంటే వాళ్లని వొదిలి యలా పోవడం? అయితే పెళ్లాడమని మీరు చెప్పినమాటకూడా సుతలామూకొట్టి పారెయకూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంతవిలవో అంత