పుట:Kanyashulkamu020647mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(గాక బాకీ) నిల్‌ బండిసున్నా! రెండోపద్దు - డెబిట్‌ (ఖర్చు) - లోకం నన్ను బహిష్కారం చేస్తారు. అందుకు క్రెడిట్‌, (జమ)-లోకంలోకల్లా విలవైన వస్తువను నేను అంకించుకుని, పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను. గనుక క్రెడిటు బాలెన్సు (నిలవ) - యేమిటయా? నెగెటివ్‌ యడ్వాంటేజి, హావింగ్‌ నథింగ్‌ టు డూ వితే పాపర్‌వర్‌ల్డు - పోజిటివ్‌ యడ్వాంటేజి - పొజెసింగ్‌ ఆలిట్స్‌ వెల్త్‌! మూడోపద్దు - డెబిట్‌ - నష్టం - "వీడి పెళ్లాం వెధవముండ" అంటారు - నోటా బీనీ - యీ పద్దు నిజంగా డెబిటేనా? ఆడిట్‌ డిపార్ట్‌మెంటు వార్నడిగి సంశయం తీర్చుకోవాలి. అందాకా మ-రా-రా-శ్రీ, గిరీశంగారి అభిప్రాయం యేమంటే - విడో అనేది యేమిటి? ఏనేమ్‌! ఓపేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాశుందా? మనిషిని ముస్తాబుచేసి యదట నిలబెడితే, యిది పునిస్త్రీ, యిది విడో అని చప్పగలిగిన పెద్దమనిషి యవడు? ఒహడూలేడు. గనక విడో అనే వస్తువ యక్కడుందయా? వెక్కిరించే వెధవల నోళ్లలో వుంది. దీనికి క్రెడిట్‌, (లాభం) - యేమనగా - విడో పెళ్లాడిందంటె అశుభం వోగాయిత్యం అని అటెవడూ కన్నెయ్యడు. యిక డెబిట్లేని శుద్ధక్రెడిట్‌, నంబర్‌ ఫోర్‌, "చుక్కలవలె, కర్పూరపు ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్‌ । క్రిక్కిరిసి పిక్కటిల్లెను," అన్నట్లు గిరీశంగారి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశంగారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూసు పాపర్లలో పెద్దక్షరాల్తోపడుతుంది. క్రెడిట్‌ నంబర్‌ ఫైవ్‌, విడో మారియేజి యసోసియేషన్‌వారు ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మక్కూడా కొంచెం డబ్బుంది. డెబిట్‌ - దావా తెస్తేగాని అవుధాన్లు మావఁగారు దాన్లో దమ్మిడీ యివ్వడు.


ప్రొజెండ్‌ కాన్సన్నీ విచారించగా, అవశ్యం విడోమారియేజి చేసుకుని తీరవలసిందే. అయితే సాధనవేఁవిటి? యేదైనా యాసెన్‌ బ్రిడ్జికట్టి వొడ్డు చేరాలి. (పైకి ముఖం యెత్తి ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పైకితీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్య హరిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు. ఆడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూంటుందిగాని, నేనంతవాణ్ణీ కానా యేవిఁటి? స్నేహంపట్ల పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం లావు చనుంచేసినా సుతిమించే వరకూ యవరూ తప్పు బట్టబోరు. రాత్రిళ్లు అరబ్బీనైట్లు, కాశీమజిలీలు, మదనకామరాజు కథలూ చెబుతూవుంటే యంతో సర్‌దాగా పక్కని కూచుని వింటుంది, లవ్‌ స్టోరీజ్‌ బుఱ్ఱకెక్కించాను. కొంత గ్రౌండ్‌ ప్రిపేరైంది గనక, యిహ విడో మారియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టాయనా, రామవరం చలో, విడో మారియేజి కరో! లెట్‌