పుట:Kanyashulkamu020647mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్యూటీ చూస్తే యేమీ తోచకుండావున్నది. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషికాదు. పాతరస్తాలేం పనికి రాకుండా వున్నాయి. నా యక్‌స్పీరియన్సూ, నాశృంగార చేష్టలూ గుడ్డిగవ్వంత పని చెయ్యకుండా వున్నాయి. యింత సింప్లిసిటీ యక్కడా కానలేదు. దీనికి లవ్‌ సిగ్నల్సు రామరామా! యేమీ తెలియవు. చమత్కారంమాటలు ఆడితే యేమిన్నీ అర్థంచేసుకోలేక ఆలేడికళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్‌ డ్రెడ్ఫుల్లీ యిన్‌ లవ్‌ విత్‌ హర్‌. దీన్ని చూసిన దగ్గిర్నించీ టౌను లవ్‌సూ, డాన్సింగర్లుసూ మీద పరమాసహ్యంపుట్టింది. పోజిటివ్‌ యబహరెన్స్‌. వాళ్ల పెంకెమాటలూ, పెడర్థాలు, దొంగవేషాలూ, డామిట్‌! అంతా యిన్సిన్సిరిటీయే గదా? యిన్నాళ్లు మధురవాణి వలల్లోపడి యెలాగు యాస్‌ని అయిపోయినానో నాకు నామట్టుకే ఆశ్చర్యంగావుంది! మధురవాణికీ యీమనిషికీ కంపారిజన్‌ వున్నదా? అది రంగువేసిన గాజుపూస. యిది ప్యూర్‌ డైమండ్‌! కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగేది కాదు. గనక కొత్తదారీ, కొంత న్యాయవైఁనదారీ తొక్కాలి. యేవిఁటయా అది? మాయోపాయంచేసి దీన్ని లేవతీసుకుపోయి విడో మారియేజి చేసుకుంటినట్టాయనా కీర్తీ, సుఖంకూడా దక్కుతాయి. "టూ బర్‌డ్స్‌ యట్‌ వన్‌ షాట్‌!" యిలాంటి అట్టర్లీ యిన్నోసెంట్‌ విడోని వొప్పించి తీసుకుపోయి పెళ్లాడితే మజా, ప్రయోజకత్వమూగాని, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో, దూదేకులవాడితోనో లేచిపోవడానికి సిద్ధంగావున్న దండుముండల్ని విడో మారియేజి చేసుకుంటే హెల్‌! పూటకూళ్లమ్మలాంటి ముండని పెళ్లాడ్డం విడో మారియేజి అనిపించుకోదు. అది దొంగముండా మారియేజి! యిదేవిఁటయా యిది, యీ బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విడో విత్‌ గిల్ట్‌లెటర్స్‌! అయితే, గియితే, మ-రా-రా-శ్రీ, యన్‌. - గిరీశంగారు విడో మారియేజి చేసుకోవడమేనా? "టు మారీ యె విడో, ఆర్‌ నాట్‌ టు మారీ, దటీజ్‌ ది క్వశ్చన్‌!" షేక్‌స్పియర్‌ పడ్డ అవస్థలో పడ్డాం! "తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలిసిపోయినాడన్నట్లు" నావంటి బుద్ధిమంతుడు తొందరపడి యేపనీ చెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజువేసి, జమాఖర్చుచేసుకుని మరీ డిసైడ్‌ చెయ్యాలి. లెటస్‌ సీ. Imprimis ఒకటోపద్దు డెబిట్‌ (నష్టం) - విడో మారియేజి చేసుకుంటే మావాళ్లు అక్కరచెయ్యరు. అందుకు క్రెడిట్‌, (లాభం) - వాళ్లిప్పుడు చేస్తూన్న అక్కరేవుఁంది? గనక బాలెన్స్‌