పుట:Kanyashulkamu020647mbp.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ: ఆ గాడిదకొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రాణానికీ డబ్బుకీ లంకె. డబ్బుకీ వాడికే స్నేహంగాని మరి యవరితోనూ స్నేహం లేదు. అయితే వాడికి వ్యవహారజ్ఞానం లేకపోవడం చాతా, కోర్టంటే భయం చాతా, నా సలహాలేక బతకలేడు. వాడే అన్నమాటేవిఁటి, యీ తాలూకాలో సివిలు మేజిస్ట్రేట్లు యెక్కడొచ్చినా రామప్పంతులు పప్పులేని పులగం వుండదు.

కరట: ఆ మాటవినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలం చాత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుక్కొచ్చాను. మా పింతల్లికొడుకు బియ్యే బియ్యెల్‌ పాసయినాడండి. డిప్టీకలక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతనివల్ల గడ్డిపరకంత సాయం లేదుగదా? మీది మిక్కిలి కూరానారా యవళ్ళయినా గృహస్థులు గృహస్థు మర్యాదకి పంపించి, తల్లయినా పెళ్ళాం అయినా అవి పుచ్చుకుంటే, తిరగ గొట్టిందాకా అభోజనం కూచుంటాడు! పెట్టడానికి పుచ్చుకోడానికీ నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లింది కాని మా వాళ్ళ ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. "ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే కాని మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు" అని కవీశ్వరుడన్నాడు .

రామ: యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్నమాటేవిటి అడ్డవైఁన జాతుల వాళ్ళకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్ళవారికి మా చాకచక్యాలబ్బుతాయండీ. మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది. మీరు తెచ్చిపెట్టుకున్నది. యెరువు సరుకు యెరువు సరుకే. విన్నారా? మీ వాళ్ళు లంచాలు పుచ్చుకోడం చాతకాక, పతివ్రతలమని వేషం వేస్తారు.

కరట: అదే పతకవైఁతే అది అమ్ముకు బతకనాఁ అన్నట్టు మా వాళ్ళకే చాతయితే నాకు యీ అవస్థేవఁండీ? మావాడు పది మంది పార్టీలతో చెబితే పదిరాళ్ళ సొమ్ము దొరుకును. యీ చిక్కులు లేకపోవును.

రామ: యెవిఁటా చిక్కులు?

కరట: రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లక పోతే దావా పడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకటదీక్షితులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్ళయిన నెల రోజుల్లో యిస్తావన్నారండి. అందుచేత అది వదులుకొని లుబ్దావుధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారని విని తమ దర్శనానికి వచ్చానండి. యిదిగాని తాము సమకూరుస్తే పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.