పుట:Kanyashulkamu020647mbp.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుర: యీ వేషం?

కరట: ఉదరనిమిత్తం బహుకృతవేషం యిది దేవుఁడిచ్చిన వేషవేఁను.

మధుర: నా దగిరేనా మర్మం? యీ పిల్లెవరో?

కరట: నా కొమార్త.

మధుర: నాటకవఁల్లా చెడి పొగటి వేషాల్లో దిగిందా? పెట్టి పుట్టారుగదా యేల యీ అవస్థ?

కరట: నీ దయవల్ల దేవుడిచ్చిన స్తితికేం లోపం రాలేదు. నిన్ను చూదావఁని వచ్చాను.

మధుర: యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత గాదు?

కరట: నీలాంటి మనిషి మళ్ళీవుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీదగ్గిరకి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి కుమారరత్నంగారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరువాత, నేనుగానీ నీ యింటికి వస్తే పీక ఉత్తరించేస్తాడేమో అనే భయం చేత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుఁణ్ణి సదా ప్రార్ధిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?

మధుర: డిప్టీకలక్టరు గారి కుమారరత్నం గార్ని, తండ్రి చదువు పేరు పెట్టి చన్నపట్ణం తగిలిన రెండు నెల్లదాకా ఆయన నాస్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ తరువాత మొన్నటిదాకా గిరీశం గారు నన్ను వుంచారు గాని, డబ్బుకి యటాముటీగా వుండేది. నా యింటికి వచ్చిన వాడల్లా తన కొడుక్కి దోస్తీ అయివుంటాడని డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నా యింటికి రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావఁని యీ వూరొచ్చాను.

కరట: (ముక్కు మీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువు చెప్పడానిక్కుదురుకుని మావాళ్ళింట్లో చేరాడు. వాడికి పెందరాళే ఉద్వాసన చప్పాలి.

మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) నాదగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నా దగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్టీ కలక్టరుగార్ని తిట్టారే. ఆయన కంటే మీ న్యాయం యేం బాగావుంది? నా దగ్గిరకు వచ్చినందుకు, మీ భార్యాగారు ముందు మిమ్మల్ని మెడబట్టుకుని యింట్లోంచి తరవ్వఁలిసింది. తనకి రొట్టా, ఒహడికి ముక్కానా?