పుట:Kanyashulkamu020647mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రామ: యీ పెళ్ళిలోమేజువాణీ పెట్టి పదిరాళ్ళిప్పిస్తాను. మాటాడ కూరుకో.

మధుర: (ముక్కు మీద వేలుంచుకొని) లుబ్దావుధాన్లు యదట నేను మేజువాణీ ఆఁ!

రామ: పేరు వాడుగాని, పెద్దన్నేనే కదూ?

(హేడ్‌ కనిస్టేబ్‌ చుట్ట కాలుస్తూ ప్రవేశించి కుర్చిమీద కూర్చొనును.)

హెడ్‌ : రామప్పంతులూ! యినస్పెక్టరికే టోపీ వేశావటే?

రామ: (హెడ్‌ కనిస్టేబు చెవిలో) గారూ గారూ అనవయ్యా.

హెడ్‌ : యెప్పుడూలేంది గారేవిఁటి, గీరేవిఁటి, చింత గారు?

రామ: ఆడవాళ్ళున్న చోటికి తోసుకు రావడవేఁనా, అన్నా!

హెడ్‌ : ఆడవాళ్ళంటున్నావు, నువ్వు కూడా అందులోనె జమాయేవిఁటి? అహ! హ!

రామ: హాస్యానికి వేళాపాళా వుండాలి.

హెడ్‌ : నేను హాస్యంకోసం రాలేదు యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయడి దగ్గిర పాతిక రూపాయల్లాగావట, యిలా యందరి దగ్గిర లాగాడో రామప్పంతుల్ని నిల్చున్న పొట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచితంగా చెప్పి యినస్పెక్టరు పాలెం వెళ్ళిపోయినాడు.

రామ: చిన్నప్పుడు ఒక్క బర్లో చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని పిలక నేనూ, నా పిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయడి మాట మాత్రం శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను.

హెడ్‌ : నే నెలా వస్తాను నీతోటి నాకు వల్లమాల్నపనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను.

రామ: (హెడ్‌ చెవులో) నా యింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీకు పుణ్యవుంటుంది.

హెడ్‌ : అదా నీ ఘోష! అలాక్కానియి, (నిష్క్రమించును)

రామ: (తనలో) అదుగో మళ్ళీ ఏకవచనవేఁ కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ.

నౌఖరు: (ప్రవేశించును) సిత్తం బాబు.

రామ: గుర్రం కట్టమను.

నౌఖరు: సిత్తం బాబు, (నిష్క్రమించును)

రామ: చూశావూ మధురవాణీ నేన్నిలబడ్డచోట రూపాయలు గలగల్రాలతాయి, యీ యినస్పెక్టరుగాడికి, యీ తాలూకాకి వచ్చింతరువాత అయిదారు వేలు యిప్పించాను. వీధి తలుపు వేసుకుని సంగీత సాధకం చేసుకో, విద్య వంటి వస్తువు లేదు. (గుమ్మందాటి నాలుగడుగులు వెళ్ళి తిరిగి వచ్చి) అప్పుడే వీణ