పుట:Kanyashulkamu020647mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుర: యలాచేశారీ మహాచిత్రం? పెళ్ళైతే ధనం ఖర్చౌతుంది గాని, రావడ వెఁలాగ?

రామ: లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడవేఁ కదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడను కున్నావు? లుబ్దావుధాన్లు జాతకం యగా దిగా చూసి, శీఘ్రంలో వివాహ యోగం వుందన్నాడు, ఆ వివాహంవల్ల ధనయోగ వుఁందన్నాడు, దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశ ముందుకి, డబ్బు ఖర్చౌంతుందన్న భయం వెనక్కిలాగడం ఆరంభించింది. యింతట్లో పండా గారిక్కడికొచ్చారు. ఆయన్ని కూడా తయారు చేశాను. లుబ్దావుధాన్లు అనుమానం తీర్చుకుందావఁని ఆయనకి జాతకం చూపించే సరికి పండాగారు యేమన్నారూ? ‘వివాహ ధన యోగాలు జవిఁలిగావున్నాయి, అయితే మీరు పెద్దవాళ్ళు, యిప్పుడు మీకు పిల్ల నెవరిస్తారు, పెళ్ళెలా అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహా యోగాలు జాతకాల్లో పట్టినప్పుడు, గొప్ప మేలుకు బదులుగా గొప్ప కీడు సంభవిస్తుంది. అనగా మీకు మారకవోఁ, ధననష్టవోఁ సంభవిస్తుంది. గ్రహశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చెయ్యండి, కొంత జబ్బో గిబ్బో చేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచి రోజు చూసి సూర్య నమస్కారాలు ఆరంభించండి’ అని చెప్పేసరికి అవుఁధాన్లు గుండె రెండు చెక్కలై వివాహప్రయత్నం ఆరంభించాడు. యిదీ కథ.

మధుర: యేమి కల్పన!

రామ: యింకావుంది యిహను కృష్ణ రాయపురంలో అగ్నిహోత్రావుఁధాన్లు కూతురు జాతక వెఁలావుందట? చప్పడానికి అలవి లేదు. అది కాలు పెట్టిన యిల్లు పది యిళ్ళౌతుందట. అది పట్టిందల్లా బంగార వౌఁతుందట!

మధుర: నిజవేఁనా లేక అదీ మీ బనాయింపేనా?

రామ: అది మట్టుకు నా బనాయింపు కాదు. అగ్నిహోత్రావుఁధాన్లే జాతకం అలా బనాయించాడు. మా బ్రాహ్మల్లో యిది పరిపాటే, పెళ్ళిళ్ళలో పంపించేది ఒహ జాతకవూఁ నిజంవుండదు.

మధుర: యేమ్మోసం!

రామ: లౌక్యం, లౌక్యవఁను!

మధుర: రెండింటికీ యేవిఁటో భేదం.

రామ: నమ్మించోట చేస్తే మోసం, నమ్మంచోట చేస్తే లౌక్యవఁను.

మధుర: తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్థవేఁవిటి?

రామ: యావఁన్నావూ? అబద్ధవఁనా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అదివకవృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిజాన్ని పోలిన అబద్ధవాఁడి ద్రవ్యా కర్షణ చేసేది. యీ ధర్మ సూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి.