పుట:Kanyashulkamu020647mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంకటే-- సుబ్బిని లుబ్ధావుఁధాల్లికి యివ్వడం మంచిదంటారా యెవిఁటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే?

గిరీ: ఫెమినైన్స్‌ ఫూల్సన్నాడు. "పడుపడుఅన్న నా సవితేగాని పడ్డనాసవితి లేదంది" టెవర్తోను. నూతులో పడడం గీతులోపడడం నాన్సన్స్‌, ఓ రెండు తులాల సరుకోటి మీనాన్నచేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆమాట మానేస్తుంది. గాని నా ఆర్గ్యుమెంటు విను.

వెంక: యేవిఁటండి?

గిరీశం: పెళ్ల`నే వస్తువ, శుభవాఁ అశుభవాఁ? మంచిదా చెడ్డదా? చెప్పు.

వెంక-- మంచిదే.

గిరీశం-- వెరిగుడ్‌! పెళ్లనేది మంచి పదార్థవైఁతే "అధికస్య అధికం ఫలం" అన్నాడు గనక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడుచస్తే మరోడికి, మరోడుచస్తే మరోడికి, యిలాగ పెళ్లిమీద పెళ్లి, పెళ్లిమీద పెళ్లిఅయి, వీడిదగ్గిరో వెయ్యి, వాడిదగ్గిరో వెయ్యి, మరోడిదగ్గిర మరోవెయ్యి, రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టె లాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివఁంతుణ్నిచూసి పెళ్లాడితే చెప్పావ్‌ మజా? ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యంవుంటే పరసౌఖ్యంకూడా సాధించావేఁ అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్‌మెంటు హక్కు యష్ఠాబ్లిష్‌ అవుతుంది.

వెంక-- కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి?

గిరీ-- మరేవిఁటనుకున్నావ్‌? నెవ్వర్డూబైహావ్సన్నాడు చేస్తే శుద్ధక్షవరవేఁగాని తిరపతి మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ అస్త్రంతోటే మీతండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు "థింక్‌" అన్నాడోయి. ఆలోచిస్తేగాని నిజం బోధపడదు. బాగా ఆలోచించగా, కన్యాశుల్కంలేని మారేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా?

వెంక-- యెలాగండి?

గిరీ-- అలా అడగవోయి, యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్కవఁయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యింత వెండిపెట్టాలి అనిరూపాయిలకి బదులుగా వెండిబంగారాలకింద ధనం లాగితే, కన్యాశుల్కం అయిందికాదేం? యీ పెద్దపెద్ద పంతుళ్లవారంతా యిలా చేస్తూన్నవారేనా?

వెంక-- అవును.

గిరీ-- యిక దొర్లలోనో? వాళ్లతస్సా గొయ్యా, యిల్లుగుల్ల చేస్తారోయి; అవి గుడ్డలుకావు, అవి శెంట్లుకావు, అవి జూయల్సుకావు, మారియేజి సెటిలుమెంటని బోలెడు ఆస్తికూడా లాగుతారు. యీ ఆర్గ్యుమెంటు నేను చెప్పేసరికి నీ