పుట:Kanyashulkamu020647mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నాన్నా తమ్ముడికి పెళ్లిచెయ్యాలంటే నాసొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండిగాని దాని కొంపముంచి లుబ్ధావుఁధాల్లుఁకి యివ్వొద్దని" చెప్పింది. దాంతో నీ తండ్రికి వెఱ్ఱికోపం వొచ్చి వుత్తరాపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నంతో విస్తరితీసికెళ్లి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటక శాస్తుల్లు అడ్డుపడబోతే చెంబుతో నీళ్లు వాడినెత్తిం దిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపంవొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్లవూరెళ్లిపోయినాడు.

వెంక-- దీనిపేరెనా యేవిఁటి మానాన్నంజేబులో వేసుకోవడం?

గిరీశం-- పేషన్స్‌! కొసాకీవిను. స్కౌండ్రల్‌ కరటక శాస్తుల్లు వెళ్లిపోయినాడని సంతోషించానుగాని, నీ సిస్టర్‌ ఫేట్‌ విషయవైఁ మహా విచారవైఁంది. నేనే దాని హజ్బెండ్నైవుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ ఒకమూలకూచుంది. అప్పుణ్ణే వెళ్లి, నీళ్లపొయిలో నిప్పేసి, నీళ్లుతోడి, నీసిస్టర్ని స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావఁని అరుగుమీద నేను బిచాణావేసే సరికి, నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగుమీదే బిచాణా వేసి, ఒక్క సిగరయినా కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపాడొయ్‌. మొత్తానికి కత్తు కలిపేశాను.

వెంక-- యాలాక్కలిపారేవిఁటి?

గిరీ-- ఒక పొలిటికల్‌ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.

వెంక -- యెవిఁటండా అస్త్రం?

గిరీ -- ఒకడు చెప్పిందల్లా మహాబాగుందండవేఁ. సమ్మోహనాస్త్రవఁంటే అదేకదా?

వెంక -- లెక్చరిచ్చి మాతండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ?

గిరీ-- కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మారియేజి కూడుననే తోస్తూంది.

వెంక-- యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి?

గిరీ -- ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్ఫెంటు మారేజీలు అయితెనేగాని, యంగ్‌ విడోజ్‌ వుండరు. యంగ్‌ విడోజ్‌ వుంటేనేగాని, విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదుగదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే, సివిలిజేషన్‌ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంటు మారేజి చేయ్యవలసిందే. యిదివొహ కొత్తడిస్కవరీ; నంబర్‌టూ, చిన్నపిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లిచెయ్యడం కూడా మంచిదే అనినేను వాదిస్తాను.