పుట:Kanyashulkamu020647mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరట- నేను చెప్పిస్తాన్రా.

శిష్యుడు- నిజంగాను?

కరట- నిజంగాన్రా, గాని ఒకషరతుంది.

శిష్యు- యెవిఁటండి?

కరట- నాకో కష్ఠసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్‌ చేసుకురావాలి.

శిష్యు- నావల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా?

కరట- యీరాచకార్యం నీవల్లేకావాలి. మరెవడివల్లాకాదు. అదేవిఁటంటె, ఓపదిరోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి.

శిష్యు- గణియం పట్ణంలోవుండి పోయిందే?

కరట- అట్టే గణియం అవసరంలేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ల కన్నెపిల్లలావుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగుపూటలు వాళ్లింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేశి పారిపోయిరా. నిజవైఁన పెళ్లిముహర్తం చాలా వ్యవధుంది.

శిష్యు- యిదెంతపని.

కరట- అలా అనుకోకు. అతి చేస్తి వట్టాయనా, అనుమాన పడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది.

శిష్యు- మీకా భయంవొద్దు.

కరట- నువ్వునెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను.

శిష్యు- అలాప్రమాణం చెయ్యండి.

కరట- యిదుగో యీపుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను.

శిష్యుడు - యీపుస్తకంమీద నాకు నమ్మకం పోయింది. మరోగట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా?

కరట- తప్పితే భూమితోడ్రా.

శిష్యు- మీరు యగేస్తే భూవేఁం జేస్తుంది? మీ మాటేచాలును కానీండి.


3-వ స్థలము. అగ్నిహోత్రావధాన్లు యింటి యదటివీధి.

[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]

వెంక- రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా?

గిరీశం- లెక్చరేవిఁటోయ్‌. ధణుతెగిరిపోయింది. మీతండ్రి మైరావణ చరిత్రోయ్‌. మీఅంకుల్‌ కరటకశాస్త్రి స్కౌండ్రల్లా క్కనపడుతున్నాడు.

వెంక- యేం జరిగిందేం జరిగిందేవిఁటి?

గిరీశం విను. రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టాడోయి మీ మావఁ. సబ్జక్టు నేను కొంచం యెత్తగానే తనుకూడా గట్టిగా సపోర్టు చేస్తా