పుట:Kanyashulkamu020647mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యీచదువిక్కడితో చాలించి గిరీశంగారి దగ్గిర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి యింగిలీషొచ్చునని యేం గఱ్ఱాగా వుంది?

కరట-- యెవిఁట్రా అబ్బీ అంటున్నావు?

శిష్యు-- యెదో నాస్వంత ఘోష.

కరట-- గురువునిగదా, అదేదో నాకూ కొంచెం చెబుదూ.

శిష్యు-- చప్పడానికేవుఁందండి? నాటకంలో నాచాత వేషం కట్టించి పెద్దచాంతాళ్లలాంటి హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు నాల్రోజులి కోశ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదుగదా? పట్నంవొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం వూసుపోక "పుస్తకం తియ్యంటె" సంస్కృతం యెంవఁచ్చేని?

కరట-- యిటుపైన్చూడు యలా చెబుతానో, రోజుకి నాలుగేసి శ్లోకాలు చెబుతాను. కొత్తశ్లోకం చదువు.

శిష్యు--

"అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా ।
హిమాలయో నామ నగాధిరాజః॥"

కరట-- మొదటి కొచ్చావేం?

శిష్యు-- మొదలూకొసా వొక్కలాగే కనపడుతూంది.

కరట-- (నవ్వి) పోనియ్‌, మొదణ్ణించే చదువుదాం.

శిష్యు-- చదివినా యేంలాభవుఁంది. యీశ్లోకం శుద్ధ అబద్ధంట.

కరట-- యవరుచెప్పారు?

శిష్యుడు -- గిరీశంగారు.

కరట-- యెంచెప్పాడు?

శిష్యు-- హిమాలయం రెండుసముద్రాలకీ దాసి, రూళ్ల గఱ్ఱలాగలేదట. మాపులో చూపించాడు.

కరట-- హిమాలయం శిగగోశిరిగాని. ఆపుస్తకం ముణిచి నామాటవిను.

శిష్యు-- చిత్తం (పుస్తకం మూయును.)

కరట-- చదువన్న దెందుకు, పొట్ట పోషించుకోడానిగ్గదా?

శిష్యుడు- అవును.

కరట-- యీరోజుల్లో నీసంస్కృత చదువెవడి క్కావాలి?

శిష్యు-- దరిద్రులి క్కావాలి.

కరట-- బాగా చెప్పావు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో?

శిష్యు-- చెప్పించే దాతేడీ?