పుట:Kanyashulkamu020647mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెంక-- మా నాన్న నాక్కూడాపెళ్లి చాస్తాడు.

గిరీశం-- యీ వాళో పెద్ద పెళ్లినీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్‌ పూరా ప్రయోజకుడివే, యిహ నిజవైఁనపెళ్లా? యింతచదువూ చదువుకుని నీతండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్‌? మాంచియెఱ్ఱగా బుఱ్ఱగావున్న యంగ్విడోని నువ్‌ పెళ్లాడకపోతే ఐషుడ్బి యషేమ్డాఫ్యూ!


2-వ స్థలము. దేవాలయం

[పువ్వుల తోటలో మండపంమీద కూచుని, శిష్యుడు ప్రవేశించును.]

శిష్యుడు-- ఆర్నెల్లకోమాటు పొస్తకంపట్టుకుంటే కొత్తశ్లోకాలు పాతశ్లోకాలు ఒక్కలా గ్కనపడతాయి. యిప్పుడు కొత్తశ్లోకం కనుక్కొమ్మంటే నాశక్యవాఁ? సిద్ధాంతినెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కొవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పియె శ్లోకం కనపడితే ఆశ్లోకం చదువుతాను.

"మృగాః ప్రియాళు ద్రుమమంజరీణాం"

యిదేదో చదివినజ్ఞాపకం లీలగావుంది. లేళ్లుపరిగెత్తాయని కాదూ? యేం గొప్పమాట చెప్పాడోయి కవి! లేళ్లు పరిగెత్తితే యవడిక్కావాలి. పరిగెత్తకపొతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీపుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశీ కట్టడం కాళిదాసుకేం తెలుసును? తెల్లవాడిదా మహిమ! యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని; నిలుచున్న పాట్ను చెబుతాడు.

"ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ"

ముద్దెట్టు కున్నాడటోయి ముండాకొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ?

[కరటకశాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనుకనుంచి ప్రవేశించును.]

    "వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం ।
    ధునోతి నిర్గం ధతయాస్మచేతః" ॥

యిదికూడా చదివినట్టె వుందోయి, ఆపువ్వెదో కవికిష్ఠంలేదట. యిష్ఠం లేకపోతె ములిగిపోయింది కాబోలు! మాగురువుగారికి దొండకాయ కూర యిష్ఠం లేదు, గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆకూరె వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్ఠవెఁ యిలా యేడుస్తూంటే చచ్చినవాడి యిష్ఠాయిష్ఠాల్తో యేంపని?