పుట:Kanyashulkamu020647mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయవైఁరాసిన ఉపన్యాసం పైకితీయ్‌. మావఁగారికి లెక్చరివ్వడాని కత్తీ కఠారీనూరాలి.

వెంకటేశం-- మీలెక్చరుమాట అలావుణ్ణీండిగాని యీవాళ నాగండం గడిచిందిగదా అని సంతోషిస్తున్నాను. మీఱ్ఱాకపోతే పరిక్ష ఫేలయినందుకు మానాన్న పెయ్యకట్టుతాడుతో చమ్డా లెక్కగొట్టును.

గిరీశం-- యిలాంటి ప్రమాదాల్తప్పించుకోవడవేఁ ప్రజ్ఞ. యేవైఁనా డిఫికల్టీ వొచ్చినప్పుడు ఒక ఠస్సావేశావఁంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పోలిటిషనంటే మరేవిఁటనుకున్నావ్‌? పూజా నమస్కారాల్లేక బూజెక్కున్నాను గాని మనకంట్రీయే ఇండిపెండెంట్‌ అయితే గ్లాడ్స్టన్‌లాగ దివాన్గిరీ చలాయిస్తును. యేమి వాయ్‌! మీ తండ్రివైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్ణంనించి అరకట్టేతెచ్చాంగదా, యేమి సాధనం?

వెంక-- నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బుతెస్తాను.

గిరీశం-- నీబుద్ధియలా వికసిస్తూందో చూశావా? యిలా తర్ఫీదవుతుంటే నువ్వుకూడా పెద్దపోలిటిషను వవుతావు.

[బుచ్చమ్మ ప్రవేశించును.]

బుచ్చమ్మ-- తమ్ముడూ అమ్మ కాళ్లు కడుక్కోమంచూందిరా.

గిరీశం-- (తనలో) హౌ బ్యూటిపుల్‌! క్వైటనెక్‌స్పెక్టెడ్‌!

బుచ్చమ్మ-- అయ్యా మీరు చల్దివణ్ణం తించారా?

గిరీశం-- నాట్ది స్లైటెస్టబ్జక్‌షన్‌, అనగా యంతమాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండిదుగో వస్తున్నాను. తోవలో యేటిదగ్గిర సంధ్యావందనం అదీ చేసుకున్నాను.

(బుచ్చమ్మ వెళ్లును.)

గిరీశం-- వాట్‌, యీమె నీ సిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?

వెంక-- మాఅక్కే, జుత్తుకి చవుఁఱ్ఱాసుకోదు.

గిరీశం-- తల చెడ్డం అంటే, విడో అన్నమాట. చవుఁరు గివుఁరూ జాంతే నయ్‌. గాని యిన్నాళ్లాయి నీకు విడో మారేజి విషయవైఁ లెక్చర్లిస్తూవుంటే యీ కథ యెప్పుడూ చెప్పావుకావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో వుందటోయ్‌! యేమి దురవస్థ! మైహార్ట్‌ మెల్‌ట్స్‌. నేనే తండ్రినైతే యీపిల్లకి విడోమారియెజ్జేసి శాశ్వితవైఁనకీర్తి సంపాదిస్తును. (తనలో) యేమి చక్కదనం, యీసొంపు యక్కడా చూళ్లేదే! పల్లిటూరు వూసు పోదనుకున్నానుగాని పెద్ద కాం`పేనుకి అవకాశం యిక్కడ కూడా దొరకడం నా అదృష్టం.