పుట:Kanyashulkamu020647mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్ని-- యెన్నేళ్లైతేనేవిఁ? నలభైయ్యయిదు.

గిరీశం-- లుబ్ధావదాన్లుగారు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవఁంటే నాకు సంతోషవేఁగానండి. ఆయనకి అరవయ్యేళ్లు దాటాయండి, యీడేవఁయినా సెల్లింగ్‌ గర్ల్‌స్‌ అనగా కన్యాశుల్కం, డామిట్‌! యంత మాత్రమూ కూడదండి, నేను పూనాలో వున్నప్పుడు అందువిషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్కబిగిని లెక్చరిచ్చానండి, సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పనని తమచేతనే వొప్పిస్తాను.

కరట-- బావా యీసమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను.

అగ్ని-- వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీగాడిదకొడుకూ తిండిపోతుల్లాగ నాయింటజేరి నన్ననేవాళ్లే. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకుచావండి.

వెంకమ్మ-- నాతో చప్పకుండానే?

అగ్ని-- ఆడముండల్తోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుఁణ్ణే! (లేచివెళ్లును.)

కరట-- యెంమార్దవం.

వెంక -- అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యో గొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనేవున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టంసుఖం వొళ్లునాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నే బతికి బాగుండాలంటే యీ సమ్మంధం తప్పించు.

కరట-- గట్టి అసాధ్యంతెచ్చిపెట్టావే, వొట్టిమూర్ఖప గాడిదకొడుకు. యెదురుచెప్పినకొద్దీ మరింత కొఱ్ఱెక్కుతాడు. యేం చేయగల్గుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా వుంది.

గిరీశం-- అమ్మా మీరు యెందుకలా విచారిస్తారు? అవుఁధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక్కగంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవఁని లెక్చరిచ్చి మనసు మళ్లిస్తాను.

వెంకమ్మ-- బాబూ, అతడు మీ మానత్తకొడుకైతే మీకాళ్లు పట్టుకుంటాను, మీరువెళ్లి ఆయ్న మనస్సు మళ్లిస్తురూ. నా చర్మం చెప్పులు కుట్టియిస్తాను.

గిరీశం-- అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్ట్రం. పిల్లదొరకడవేఁ చాలువాడికి. యీసమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్లేకాదు. వాడని వాడొదిలే ఘటంకాడు.

కరట-- అమ్మీ నేనో ఉపాయం చెబుతాను యిలారా. (కరటకశాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమింతురు.)

గిరీశం-- మైడియర్‌ షేక్స్పియర్‌! నీ తండ్రి అగ్గిరావుఁడోయి. మీ యింట్లో యవళ్లకీ అతణ్ణి లొంగదీశే యలోక్వెన్సు లేదు. నాదెబ్బచూడు యివాళేం జేస్తానో.