పుట:Kanyashulkamu020647mbp.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అగ్ని-- మావకీలు గడగడ చదివేశాడండి.

గిరీశం నేను మాత్రం చదవలేకనా. అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లిచ్చేపండితుణ్ణి నాకిది పేలపిండీ కాదు; అయితె రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరిటిపండు విప్పినట్టు తర్జుమాచేసి దాఖలుచెయ్యమని శలవా?

అగ్ని-- అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చులేకుండా వీడిచాత కాగితమ్ముక్కలన్నీ తర్జుమాచేయించేస్తాను.

గిరీశం-- యింకా యింగ్లీషు కాయితాలు యేవుఁన్నా నామీద పార`య్యండి, తర్జుమా చేసిపెడతాను.

అగ్ని-- అష్లాగే.

వెంకమ్మ-- మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ. గిరీశం-- అలాగే నమ్మా.

    My dear Venkatesam-
    Twinkle! Twinkle! little star,
    How I wonder what you are!

వెంకటేశం-- There is a white man in the tent.

గిరీశం--

The boy stood on the burning deck
Whence all but he had fled.

వెంకటేశం-- Upon the same base and on the same side of it the sides of a trepezium are equal to one another.

గిరీశం-- Of man's first disobedience and the fruit of that mango tree, sing, Venkatesa, my very good boy.

వెంకటేశం-- Nouns ending in f or fe change their f or fe into ves.

అగ్ని-- యీ ఆడుతూన్న మాటలకి అర్థంయేవిఁషండి?

గిరీశం-- ఈ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావఁండి.

కరట-- అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా?

వెంకటేశం-- పొగచుట్టకు సతిమోవికి-

కరట-- చబాష్‌!

గిరీశం-- డా`మిట్‌! డోంట్రీడ్‌ దట్‌, (మెల్లగా) "నలదమయంతులిద్దరు" చదువ్‌.

వెంకటేశం-- నలదమయంతు లిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్‌.