పుట:Kanyashulkamu020647mbp.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అని నిర్ధారణచేసిన తరవాత, వారు మంచివారు కాకతీరదండి- తమవంటి మంచివారు వలవేస్తే యెక్కడా కనపడడం కష్టం అండి. గనక తమదర్శనం నాకు కావడంవల్ల యీరోజు, నాజన్మానికల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను.

గిరీ- సందేహవేఁవిఁటి!

సౌజ- మంచిగావుందావఁని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నాయందు యోగ్యత యేమీలేదు. మీరు వచ్చినపని చెప్పారుకారు.

గిరీ- నేను కనుక్కుని తమతో ఉదయం మనవిచేదునా?

సౌజ- జరూరు పనిమీద వచ్చినవారూ, పేరు చెప్పనివారూ, మీతో వారికార్యం చెబుతారా? మీది యెంతసత్యకాలం!

గిరీ- వారికి నేనేమైనా సాయంచెయడానికి అవకాశం వుంటుందేమో అనీ, తమకు నిద్రవేళైందనీ, మనవిచేశాను.

కొత్తమనిషి- గిరీశంగారు లోకోపకారపరులు.

సౌజ- మీకు కృతపరిచితులా?

కొత్తమనిషి- వారిని యెరుగనివారెవరండి?

గిరీ- వారు నాయందువుండే దయచేత అలా శలవిస్తున్నారుగాని, నన్ను అంతా యెరగడానికి నేనేపాటివాణ్ణండి. అయినా తరుచుగా లెక్చర్లు యిస్తూవుండడంచాత, వీరివంటి సత్పురుషులు నన్ను యెరిగివుండడంకద్దు; సత్కరించడంకద్దు. వీరినికూడా నేను చూచివుందును. అందుచేతనే వీరు కనపడగానే, యెవరు చెప్మా చూచినట్టుందీ! అని కలవిలపడ్డాను. వారుకూడా ప్రచ్ఛన్నులై వుందామని నిశ్చయించుకున్నారు గనక, నేను జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నం చెయ్యను; నేనుపోయి పరుంటాను. తాము ఉభయులు మాట్లాడుకోవొచ్చును.

సౌజ- అలాగే చెయ్యండి.

గిరీ- (సౌజన్యారావు పంతులుతో)నమస్కారం. (కొత్త మనిషితో) మీరు బ్రాహ్మలా?

కొత్తమనిషి- కాను.

గిరీ- (కొత్తమనిషితో)అయితే, దాసోహం!- టుది అన్నోన్‌! (నిష్క్రమించుతూ గుమ్మము దగ్గరకువెళ్లి, తిరిగిచూసి కొత్తమనిషిని బతిమాలుకున్నట్లు అభినయించి, వెళ్లును.)

సౌజ- గిరీశంగారు కవి- మహా యోగ్యవైఁన చిన్నవాడు.

కొత్తమనిషి- వితంతువులను పెళ్లాడడం, యాంటీనాచీకూడా మంచికి ఆవశ్యకవేఁనా అండి?