పుట:Kanyashulkamu020647mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోసం సమయంవొస్తే సంతోషముతో ప్రాణం యిచ్చేస్తాను. "లోకోభిన్నరుచిః" అన్నాడు. కొందరికి కందిపప్పు పచ్చడి రుచి; కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి; కొందరు అదృష్టవంతులికి, రెండుపచ్చళ్లూ రుచి. అలాగనే కొందరికి అబద్ధం రుచి; కొందరికి నిజం రుచి; చాలామందికి రెండింటీ కలగలుపు రుచి. యిది లోకస్వభావం. గనక అవసరం కలిగినప్పుడు తణుకూబెణుకూలేకుండా, అబద్ధం ఆడవలసిందే- ప్రస్తుతాంశంలో, అసిరిగాడిచేత అబద్ధం ఆడించడం నాదిపూచీ. అసిరీ- నాతడాఖా జ్ఞాపకవుఁందా, కబడదార్‌- సాక్ష్యం యివ్వకపోతే చంపేస్తాను.

హెడ్డు- అలా తోవలోకిరండి భాయీ- చర్మం చెప్పులుకుట్టియిస్తాను. (లుబ్ధావధాన్లుతో) ఆ ఛండాలుడు రావఁప్పంతులుని నమ్మక, యిలాంటి కావలసినవాళ్ల మాట వింటే; మీకు యీగతి రాకపోవునుగదా?

గిరీశం- మావాడు, కావలసినవాళ్ల సలహా వింటాడండీ. దత్తత చేసుకుంటానని యెన్నాళ్లాయో అంటున్నాడు; దత్తత చేసుకుంటే కనిపెట్టివుండనా? "పోనీ, ఓ పవరాఫ్‌ టర్నామా అయినా నా పేరవ్రాయి, నీ వ్యవహారాలు చూస్తాను" అంటే, చెవిపెట్టడు.

హెడ్డు- యేవఁండీ, అవుఁధాన్లుగారూ అలా చెయరాదటయ్యా?

లుబ్ధా- వెనకనుంచి ఆలోచించుకుందాం.

గిరీశం- అధాత్తుగా, జెయిలులోకి లాక్కుపోతే, ఆపైని చేసేపనేవిఁటి?

హెడ్డు- జయిలు సిద్ధపరిచారూ?

గిరీశం- మాటవరసకన్నాను. కీడించిమేలించాలి- యినస్పెక్టరు కుట్ర బలంగావుంది. పోలిశెట్టి సాక్ష్యం పలకనని సౌజన్యారావు పంతులుగారితో చెప్పి వూరికి వెళ్లిపోయినాడు.

హెడ్డు- అయ్యో, మరేమిటిగతి!

గిరీశం- అదే పంతులుగారూ నేనూ, విచారిస్తున్నాం.

(పూజారి గవరయ్య ప్రవేశించును.)

హెడ్డు- గవరయ్యగారూ, గురోజీ కనపడ్డారా?

గవర- యిదుగో నాతో వొస్తూంటేనే! మీపెరటి అరుగుమీదే యింతసేపూ సమాధిలో వున్నారు.

హెడ్డు- నాకు పెరటి అరుగుమీద కనపడలేదే? పోనీండి ఆయనవొచ్చారంటే బతికాను అన్నమాట- యేరీ?

గవర- యేమి అలా అడుగుతున్నారు? యిరుగో మీ యెదటా. (కాళీజాగా వేపు చూపును) మీకు కనపడలేదా యేమిటి? (కాళీజాగావైపు చూచి) యేం గురోజీ తిరస్కరిణీ విద్య అవలంబించారేమి?- ఓహో, మీగురువుగారి ఆజ్ఞ ఐందనా?-