పుట:Kanyashulkamu020647mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశం- అసిరీ .. నాదెబ్బ నీకుతెలుసును- యినస్పెక్టరూ గినస్పెక్టరూ జాంతేనై. విన్నావా, తిన్నగాబోనెక్కి నిజవేఁదో సాక్ష్యం పలక్కపోతివట్టాయనా, పీకనులివేఁసి నిన్ను నూతులోపారేస్తాను.

అసిరి- యేటిబాబూ! మీరోతెన్నా, ఆరోతెన్నా, యీరోతెన్నా, నాకేటెరిక బాబు? మీనౌకరీకి దణ్ణం పోతాను, బాబూ. ఆయమ్మ గోడగెంతడం నాను సూపులేదు బాబూ. గవరయ్యగోరు దెయ్యాన్ని సీసాలోయెడితే, గోడగెంతడం యేటిబాబు? వొట్టిఅబద్దం! నాను సూపులేదు బాబు.

గిరీశం- వాడుచూడందీ సాక్ష్యం యలా పలుకుతాడు, అన్నయ్యా?

లుబ్ధా- నాప్రాలుబ్ధం. యేవని జెప్పను?

హెడ్డు- యవరీయనా? కేసులమొహం అంటే యీయనకేమైనా తెలుసునా?

గిరీ- కేసులమొహం నాకూతెలియదు, నిజంమొహం పోలీసువాళ్లకీ తెలియదు. అబద్ధ సాక్ష్యాలవల్ల తప్పించుకోవడంకన్న, జెయిల్లోకూచోడవేఁ ఉత్తమం. ధన ప్రాణాలు రొండూపోయినా మనిషిఅన్నవాడు అసత్యం ఆడకూడదు- ఆడించకూడదు.

హెడ్డు- యేవిఁటండీ ఈయన శల్యసారధ్యం?- యవరితడు?

గిరీశం- నేను లుబ్ధావధాన్లుగారి తమ్ముణ్ణి- నా పేరు గిరీశంఅంటారు. నేను పరీక్షలు పాసైనవాణ్ణి; తెలిసిందా?

హెడ్డు- వెధవముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వేనా?

గిరీశం- డిఫమేషన్‌ అంటే మీకేమో తెలుసునా? నేను సౌజన్యారావు పంతులుగారి స్నేహితుణ్ణి- సాక్ష్యాలు యేరీతిగావున్నాయో కనుక్కుని, అన్నయ్యగారికీ మీకూ సలహాచెప్పమని పంతులుగారు నన్ను పంపితే వచ్చాను.

హెడ్డు- అలా అయితే మాకు మీరు సాయంచెయ్యాలిగాని, అబద్ధంలేకుండా సాక్ష్యం కావాలంటే యీ భూప్రపంచకమందు యెక్కడైనా సాక్ష్యం అన్నది వుంటుందా? నానెత్తిమీద యెన్ని వెంట్రుకలువున్నాయో, అన్నిసాక్ష్యాలు చూశాను. పెద్దపెద్దవకీళ్లు తయారుచేసిన సాక్ష్యాలుకూడా చూశాను. మీరు అనుభవంలేక నీతులు చెబుతున్నారుగాని, హైకోర్టు వకీళ్లుకూడా తిరగేసికొట్టమంటారు. నీపుణ్యంవుంటుంది బాబూ, నిజం అబద్ధం అని తేలగొట్టక, యేదో ఒకతడక అల్లి తయారుచేస్తేగాని ఆబోరుదక్కదు.

గిరీశం- అన్నయ్యకీ, మీకూ సహాయంచెయ్యడంకోసం కాకపోతే యింతదూరంనుంచి నేను యెందుకువచ్చాను? మీయిష్టవొఁచ్చినట్టల్లా మీకు పనికివొచ్చే అబద్ధాలు మీరు పలికించడముకు నా అభ్యంతరం యెంతమాత్రంలేదు. ఎబ్‌స్ట్రాక్టు ట్రూత్‌ అనగా సుద్ధసత్యఁవనేది, సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ అన్నమాటమాత్రం మరిచిపోకూడదని నాఅభిప్రాయము. నేను మట్టుకు నిజం