పుట:Kanyashulkamu020647mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

కన్యాశుల్కము

ప్రథమాంకము


1-వ స్థలము, విజయనగరములో బొంకుల దిబ్బ.

[గిరీశము ప్రవేశించును]

గిరీశ: సాయంకాలమైంది. పూటకూళ్ళమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్లు కింద ఖర్చు పెట్టాను. ఈవాళ ఉదయం పూటకూళ్ళమ్మకీ, నాకూ యుద్ధవైఁ పోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపం వొచ్చింది గాని, పూర్రిచర్డు చెప్పినట్లు, పేషన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు లాగేస్తే ఇదివరకు యెన్ని పర్యాయములు వూర్కుంది కాదు. యిప్పుడేదో కొంచం డాన్సింగర్లు మాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ వూళ్ళో మరి మన పప్పు వుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌ లెటర్‌ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు.

Can love be controlled by advice?
Will cupid our mothers obey?


శీఘ్రంగా యిక్కణ్ణింకి బిచాణా యెత్తి వెయ్యడమే బుద్ధికి లక్షణం గాని మధురవాణిని వదలడమంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

It is women that seduce all mankind.

నేను యేమో ఉద్యోగాలూ ఊళ్ళూ యేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో వుంది, పూర్‌ క్రీచర్‌ !

యెవరా వస్తున్నది? నాప్రియశిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవాళ కిశ్మిస్‌ శలవులు యిచ్చివుంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫేలైనట్టు కనపడుతుంది. వీణ్ణి కొంచెం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పేమిషమీద వీడితో వీడి వూరికి వుడాయిస్తే చాలా చిక్కులు వదుల్తాయి అటుంచి నరుక్కురమ్మన్నాడు.