పుట:Kanyashulkamu020647mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధుర- సరె, సౌజన్యారావు పంతులుగారు మంచివారు గనక ఆయనదాకావస్తే నాకంటె నాకు యిప్పించేస్తారు గాని, లుబ్ధావఁధాన్లు ఆరూపాయలూ, కంటా, పెట్లో పెట్టుకుని ముంగిలా మాట్లాడకుండా వూరుకుంటేనో?

కరట- దానిఖరీదు నేనిచ్చుకుంటాను.

మధు- తమరు ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు కంటె ఖరీదుయిచ్చేవారెవరు? అందుచేత ఆకంటె నాకు తిరిగీ వచ్చేవరకూ మీశిష్యుణ్ణి నాదగ్గిర తాకట్టువుంచండి.

కరట- అలాగనే.

శిష్యుడు- మీసొమ్మేంబోయింది. నాపెళ్లో?

కరట- నాలికా, తాటిపట్టెరా?

శిష్యుడు- మీరోవేళ- జయిల్లోకివెళితే

మధు- గురువుకు తగిన శిష్యుడివౌదువు!

కరట- అంత ఉపద్రంవొస్తే, నీపెళ్లిమాట నాపెళ్లాంతో యరేంజిమెంటుచేసి మరీవెళతాను.

శిష్యుడు- యేమో! ఘోరవైఁనప్రమాణం చేశారుగదా?

కరట- మధురవాణీ, కొంచంశ్రమచేసి కంటెతేవా?

మధు- యేవొఁచ్చింది తొందర?

కరట- హెడ్డుగాని, రావఁప్పంతులుగాని, వొచ్చారంటే నాకొంప ములుగుతుంది.

మధు- ములిగితే తేలుస్తాను.

కరట- అంత చాకచక్యం నీకులేదనికాదు.

(మధురవాణి లోనికివెళ్లును.)

కరట- అది చెప్పిందల్లాచెయ్యక. కొంచంపై ఒచ్చేదికాని, మరీ నడుస్తూవుండు. యేవైఁనావుంటే, నాచెవిని పడేస్తూండు.

శిష్యుడు- యవరిదగ్గిర వున్నప్పుడు వారు చెప్పిందల్లా చెయ్యడవేఁ, నా నిర్ణయం. మీరు యేం పైకాని, నాచేత ఆడవేషంవేయించి పెళ్లిచేశారో?

కరట- ప్రమాదో ధీమతామపి. యంతటివాడికైనా ఒకప్పుడు కాలుజారుతుందిరా!

(మధురవాణి కంటె పట్టుకు ప్రవేశించి.)

మధు- తాకట్టువస్తువ తప్పించుకు పారిపోతేనో? కుక్కా, నక్కా, కాదుగదా గొలుసులువేసి కట్టడానికి?

కరట- నీ వలల్లో పడ్డప్రాణి మరి తప్పించుకుపోవడం యలాగ? వాటికి వున్న పటుత్వం యేవుక్కు గొలుసులకూ వుండదు.

మధు- వలలో ముత్యపు చిప్పలుపడితే లాభంగాని, నత్తగుల్లలుపడితే మోతచేటు.