పుట:Kanyashulkamu020647mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మధు- సౌజన్యారావు పంతులుగారిది యేరకం? గిరీశంగారిది యేరకం?

కరట- యేమి సాపత్యంతెచ్చావు? కుక్కకి గంగిగోవుకూ యెంతవారో, వాడికీ ఆయనకు అంతవార. సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా, యాంటీనాచి. "వేశ్య" అనేమాట, యేమరి ఆయనయెదట పలికితివఁట్టాయనా, "అసందర్భం!" అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలినవారు యధాశక్తి యాంటీనాచులు. ఫౌఁజు ఫౌఁజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్నవూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదాఢ్ర్యం వున్నంతకాలం ప్రోనాచి, శరీరం చెడ్డతరవాత యాంటీనాచి; కొందరు బతికివున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయినతరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చినతరవాతకూడా ప్రోనాచే. అనగా యజ్ఞంచేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె.

మధు- మీయోగ్యత చెప్పేదేమిటి! గాని, హెడ్డుగారి మాటలుచూస్తే, సౌజన్యారావు పంతులుగారు లుబ్ధావధాన్లుగారిని కాపాడడానికి, విశ్వప్రయత్నం చేస్తూ వున్నట్టు కనబడుతుంది. యేమికారణమో?

కరట- చాపలు యీదడానికి, పిట్టలు యెగరడానికి యేంకారణమో అదేకారణం.

మధుర- పరోపకారం ఆయనకు సహజగుణమనా`?

కరట- కాకేవిఁ?

మధుర- మీరెందుకు, కొంచెం ఆయీదడం, యెగరడం నేర్చుకోకూడదు?

కరట- నీమాట అర్థంకాలేదు.

మధుర- యీ కేసులో నిజవేఁదో సౌజన్యారావు పంతులుగారితో చెప్పి మీరుకూడా- కొంచం లోకోపకారం చెయ్యరాదా?

కరట- మామంచి సలహా చెప్పావు! తనకు మాలిన ధర్మమా? "స్వయంతీర్ణః పరాంస్తారయతి" అన్నాడు. నిజంచెబితే పంతులు యేవంటాడో నీకు తెలుసునా? "శాస్తుల్లుగారూ మీరు నేరంచేశారు. నేనేమిచెయ్యగలను? మిమ్మునుగురించి నాకుచాలా విచారంగా వున్నది" అని వగుస్తూ, పోలీసువాళ్లతోచెప్పి, జైయిలులోకి వప్పచెప్తాడు. జైయిలునుంచి తిరిగీ వచ్చిందాకా మాత్రం నెలకో పాతికో, పరకో కనికరించి నాభార్యాకు యిస్తూవుంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యసానుకూలం కావఁడంకోసమే యీయెత్తు యెత్తాను.