పుట:Kanyashulkamu020647mbp.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తలుపు తియ్యకపోయెనా, మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది- చెరువ్వేపుపోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆపైచర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే మళ్లీ వొచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపుతీసినట్లు కానరాదు. యవడిల్లు ? యవర్తె యిది నన్ను అడ్డడానికి ? ఆశ్చర్యం ! (కొంతదూరంగా వీధిలో నిలబడి, దాసరివేషంతో శిష్యుడు చితారుమీటి పాడును.)

చరణం॥

"యిల్లుయిల్లనియేవు ।
యిల్లునాదనియేవు ।
నీయిల్లుయెక్కడే చిలుకా ?"

రామ- యిది నాయిల్లు కాదా ?

శిష్యుడు- "ఊరికి ఉత్తరాన । సమాధిపురములో ।కట్టెయిల్లున్నదే చిలుకా ॥"

రామ- వొల్లకాట్లోనా ?

శిష్యుడు-

పల్లవి॥
"యెన్నాళ్లుబ్రతికినా ।
యేమిసామ్రాజ్యమే ।
కొన్నాళ్లకోరామ చిలుకా?" ।
అనుపల్లవి॥
"మూణ్ణాళ్లబతుకునకు ।
మురిసేవు త్రుళ్లేవు ।
ముందుగతికానవే చిలుకా"

రామ- యేవిఁటీ అపశగునం పాటా !

శిష్యుడు- "కఱ్ఱలే చుట్టాలు । కట్టెలేబంధువులు ।కన్నతల్లెవ్వరే చిలుకా?"

రామ- చుట్టాలా ? వొక్క అప్పవుంది, అదియెప్పుడూ నా గుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు యింటికి యజమాని యెవరూ ? తలుపవతల సానిలంజా! తలుపివతల సంసారి వెధవలంజానూ; యిద్దరూ కలిసి యిల్లుచేరకుండా నన్ను తగుల్తున్నారు.

శిష్యుడు- "నిన్నుమోసేరు నలుగురు । వెంబడిని పదిమంది ।"

రామ- వెఱ్ఱి ముండాపాటా ! పోదాం. (గబగబ కొంతదూరము నడచి, నిలుచుని) యీతోవనే వొస్తున్నాడుకాబోలు- అదుగో పాట వినపడుతూంది. శిష్యుడు-

(పాట)
   "నువ్వుకాలిపోయేదాక ।
    కావలుందురుగాని ।
    కడకుతొలగొత్తురు ।
    వెంటనెవరూరారు చిలుకా ॥"

రామ- వెఱ్ఱి ముండాపాటా !

శిష్యుడు- పంతులుగారూ ! యక్కడున్నారు ?

రామ- పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును.)

---