పుట:Kanyashulkamu020647mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లుబ్ధా-- వాడేనే! వాడేనే! యేవిఁటే సాధనం? యిహ నేం దక్కను.

మీనా-- పూజారి గవరయ్యకి కబురుపెడతాను.

లుబ్ధా-- వొద్దు, వొద్దు, నామాటవిను. వాడొచ్చాడంటే, యిల్లు తినేస్తాడు.

మీనా-- తింటేతింటాడు. ప్రాణంకంటేనా యేవిఁటి?

లుబ్ధా-- నాకొద్దంటూంటే వినవుగదా. నువ్వు నామంచం దగ్గిర పక్కేసుకుపడుకో; నువ్వు చదువుకునే భాగవతం పుస్తకం పట్రా; తలకిందపెట్టుకు పడుకుంటాను.

(మీనాక్షి వెళ్లును.)

యీముండ నాయింట్లోంచి విరగడైపోతేనేగాని, యీ పిశాచం వొదిలిపోదు. వేదం చదువుకున్న ముండాకొడుకుని, నామీదే పడ్డతరవాత, వీడు బ్రహ్మరాక్షసిగాని, వొట్టిదెయ్యంకాడు. పోనీ అతడికే ప్రార్ధనచేస్తాను - "నాపెళ్లాం మొదటిమొగుడా!" ఆఁ! నాపెళ్లాం కాదు. లెంపలు వాయించుకుంటాను. "యీపిల్ల మొగుడా! నువ్వే నిజవైఁన మొగుడివి - నేనుకాను. దాన్ని ముట్టను - తాకను - దాంచేత చాకిరీ అయినా చేయించను. నన్ను రక్షించి, పీకపిసికెయ్యకు; పీకపిసికెయ్యకు; యేపాపం చెయబట్టో దెయ్యానివైనావు. నన్ను చంపావంటె బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. మరిజన్మం వుండదు. బాబూ! నాయనా! తండ్రీ! నాజోలికి రాకు. నీమావఁగారి పీకనులివెఁయ్యి! ఆరావఁప్పంతులుగాడి పీకనులివెఁయ్యి! లేకపోతే," (కేకలు, యేడ్పు వినబడును) ఓరిదేవుడా, మళ్లీ వొచ్చాడు కాబోలు (శిష్యుడు యేడుస్తూ పరిగెత్తివచ్చి లుబ్ధావధాన్లును గట్టిగా కౌగలించుకొనును. మీనాక్షి శిష్యుణ్ణి చీపురుగట్టతో కొట్టబోవును. శిష్యుడు తప్పించుకోగా, దెబ్బలు లుబ్ధావధాన్లకు తగులును.)

మీనా-- ముండా! నామొహురు అక్కడపడేస్తావా పడెయ్యవా? నాతాళం యేదేలంజా?

లుబ్ధా-- నన్ను కొట్టేశావేవిఁటే? (శిష్యుడితో) వొదులు, వొదులు. నన్ను ముట్టుకోకే తల్లీ (మీనాక్షితో) దీని అపవిత్రపు వొళ్లుతగిల్తే చచ్చిపోతాను. నన్ను వొదిలిపించెయ్యి.

(మీనాక్షి శిష్యుడి రెక్కలుపట్టిలాగి, బుగ్గగిల్లును. శిష్యుడు మీనాక్షి చెయ్యికరిచి పారిపోవును.)

మీనాక్షి-- దానమ్మ కడుపుకాలా, చెయ్యి కరిచేసింది నాన్నా - రక్తం బొటబొట కారుతూంది - దీన్ని హతవాఁరుస్తాను.

లుబ్ధా-- యంత దారుణప్పని చేసిందీ, ముండ! యేదమ్మా చెయ్యి (గుడ్డపీరికతో రక్తంతుడిచి) మొహురడిగావుగదా యెక్కడిదేవిఁటి?

మీనాక్షి-- ఆతండ్రివెధవ నాకిమ్మని యీముండచేతికి యిచ్చాడు. దీనినక్క వినయాలు