పుట:Kanyashulkamu020647mbp.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుచ్చ-- వుండకుండా వుంటుందా?

గిరీ-- వుంటే, యీ పెళ్లి తప్పించే సాధనం నీ చేతులోనేవుంది.

బుచ్చ-- నా చేతులోనా?

గిరీ-- అక్షరాలా.

బుచ్చ-- యేమి చిత్రమైన మాటలు చెబుతారు!

గిరీ-- యీ భూప్రపంచంమీద వుండుకున్న యావన్మంది స్త్రీలలోనూ, నిన్నొక్కర్తెనూ వలిచి, నేను నీకు సుతలామూ లొంగిపోబట్టిగదా, నాబతుకు హాస్యాలకింద ఐపోయింది.

బుచ్చ-- మీతోడు-అలా అనకండి.

గిరీ-- పోనియి - ఆమాత్రం భరవసాయిచ్చావు. ఒకమాట నాకు ప్రమాణ పూర్తిగాచెప్పు. నీ చెల్లెలు పెళ్లి తప్పించడం, నీచేత అయితే, చేస్తావా?

బుచ్చ-- చెయ్యనా?

గిరీ-- యేమో, చేస్తావో చెయ్యవో! చేస్తానని ప్రమాణంచేస్తేనే, ఆమాట నేను చెబుతాను.

బుచ్చ-- యాఁవఁని ప్రమాణం చెయ్మన్నారు?

గిరీ-- నామీద ప్రమాణం చెయ్యి.

బుచ్చ-- మీమీద ప్రమాణమే; చెప్పండి.

గిరీ-- అయితే విను. వొంటరిగా చూసి, యీమాటేనీతో రహస్యంగా చెప్పుదావఁని కాచి, కాచివుండగా, యీవేళ, మీతండ్రి వూరికి వెళ్లడం, మీతల్లి వాకట వుండడంనుంచి, సమయం చిక్కింది. చెవివొగ్గివిను. నీచెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధనంవుంది. అది యేవిఁటంటే, నువ్వు ముందూవెనకా ఆలోచించక, నాతో లేచివచ్చి నన్ను పెళ్లిచేసుకోవడవేఁ - లేకుంటే నీచెల్లెలి పెళ్లితప్పదు.

బుచ్చ-- (ముసిముసి నవ్వుతో) నేను మీతో లేచివొస్తే మాచెల్లెలు పెళ్లి ఆగిపోతుందీ? యేవిఁచిత్రాలు!

గిరీ-- ఆమాట నీచేతనే వొప్పిస్తానుకదూ - విను - పెళ్లికి తర్లి వెళ్లుతూన్నప్పుడు, రెండోనాడు రాత్రి బండీవాడి చేతులో నాలుగు రూపాయలుపెట్టి, నీబండీ తోవతప్పించి అనకాపిల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడనుంచి రామవరందాకా మా స్నేహితులు అంచీబళ్లు ఖణాయిస్తారు. ఆడుతూ పాడుతూ, మనం దౌడాయించి రామవరంలో పెళ్లాడేసుకుని సుఖంగావుందాం. యిక మీవాళ్ల సంగతి యేవౌఁతుందీ? మనం వుడాయించిన మన్నాడు తెల్లవారగట్ల, నీబండీ కనపడక, కలవిలపడి, మీవాళ్లు నెత్తీ నోరూ కొట్టుకుంటారు.