పుట:Kanyashulkamu020647mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నువ్వారంభవి? మాబుచ్చమ్మ సొగుసుకి నువ్వు వొడ్డీకి పనికిరావు. గోయెవే, డామ్‌, డర్టీ గూస్‌" అని అంటాను. అలాగే, మేనకా, ఊర్వసీ, తిలోత్తమా మొదలైన యావన్మంది అప్సరస్త్రీలనీ తన్ని తగలేస్తాను. తగిలేసి, కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్షచ్ఛాయని "హా! బుచ్చమ్మా, బుచ్చమ్మా" అని నీపేరు జపంచేస్తూ అనేక సంవత్సరాలు పద్మాసనంమీద వుండిపోతాను. అంతట కొన్నాళ్లకి నాతపస్సు ఫలించి, నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగ బయలుదేరి వస్తావు. నేను "ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!" అని, అమాంతంగా వెళ్లి నిన్ను కౌగలించుకుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ముసలివెధవ, గావంచా గుడ్డకట్టుకుని, పొడుంముక్కుతో, "బుచ్చమ్మ నా పెళ్లాం" అని అడ్డురాబోతాడు. "వెధవాయా, నువ్వు బుచ్చమ్మకి తగవు. నీ రూపాయలు నువ్వు పట్టుకుపో" అని, వొక్కతాపు తన్ని తగిలేస్తాను. మనం యిద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం.

బుచ్చ-- యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు.

గిరీ-- నువ్వు నన్ను పెళ్లాడితే, మనం బతికున్నంతకాలం నవ్వుకుంటూ, ఆనందిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అప్పుడు నిన్ను యిలా పప్పురుబ్బనిస్తానా? మనకి యెంతమంది నౌఖర్లువుంటారు! యెంతమంది చాకర్లు వుంటారు! తోటలు, దొడ్లు, గుఱ్ఱాలు, బళ్లు! నిన్ను నడవనిస్తానా? పుష్పంలాగ నెత్తిమీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో.

బుచ్చమ్మ-- నా జన్మానికి మరి ఆనంద వెఁక్కడిది?

గిరీ-- నేను, నీకు దాసుడనై "యిదుగో నన్ను స్వీకరించు. నన్ను పెళ్లాడి ఆజన్మం ఆనందం అనుభవించు. నన్ను ఆనందంలో ముంచు" అని బతిమాలుకుంటూంటే, నువ్వు అట్టి సులభసాధ్యమైన సుఖమును కాలున తన్నుకు వెళ్లిపోయి, నాబతుకు కూడా బుగ్గిని కలిపితే, నేనేమి చెయ్యగలను?

బుచ్చ-- మీ బతుక్కి లోపవేఁవిఁ? మీరు మహరాజులు.

గిరీ-- నువ్వు నన్ను పెళ్లాడితే నేను మహరాజునే అవుతాను. నీ నోటంట వచ్చిన మాట అమోఘం - వొట్టినే పోకూడదు. గనక నాతో వెళ్లిపోయిరా.

బుచ్చ-- అమ్మ నాయనా! నే మీతోరాను.

గిరీ-- సరే. రాకపోతే నేనేగదా ప్రాణత్యాగం చేస్తాను? పీడానాడాకూడా పాయె.

బుచ్చ-- అలాంటి మాటలు అనకండి.

గిరీ-- చేసేమాట, చెబితే తప్పేమిటి? నేనేమైతేనేంగాని, నీ చెల్లెలిమీదైనా నీకు కనికరం కద్దా?

బుచ్చ-- అదేం, అలా అడుగుతున్నారు?

గిరీ-- నిజంగా కనికరంవుందా?